‘అమ్మా’నుషం

7 Apr, 2016 02:34 IST|Sakshi
‘అమ్మా’నుషం

♦ కన్నబిడ్డ గొంతుకోసిన తల్లి
♦ పుట్టిన 25 రోజులకే పసిబిడ్డకు ‘నూరేళ్లు’
♦ ‘పాప కోసమే’ ఈ పాపమని అనుమానం
♦ కప్పిపుచ్చుకునేందుకు చైన్ స్నాచింగ్ డ్రామా
 
 హైదరాబాద్: ఆడపిల్లను కనాలని ఆ తల్లి ఆశపడింది.. అయితే వరుసగా ముగ్గురూ మగబిడ్డలే పుట్టారు.. భర్త ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయిస్తాననడంతో విచక్షణ కోల్పోయింది.. ఉన్న ఇద్దరు పిల్లల్లో ఒకరిని చంపేస్తే ‘కుటుంబ నియంత్రణ’ తప్పించుకోవచ్చని భావించింది. దీంతో కర్కశంగా మారిపోయిన ఆ తల్లి 25 రోజుల పసికందు గొంతు కోసింది. ఘాతుకాన్ని కప్పిపుచ్చుకునేందుకు చైన్ స్నాచింగ్ డ్రామా ఆడింది.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు తల్లిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ హృదయవిదారక ఘటన నేరేడ్‌మెట్ పోలీసుస్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకోగా.. బుధవారం వెలుగులోకి వచ్చింది.

 ముగ్గురూ మగపిల్లలే కావడంతో..
 రామకృష్ణాపురం ప్రాంతానికి చెందిన శ్రీధర్‌రాజు, పూర్ణిమ(30) భార్యాభర్తలు. శ్రీధర్‌రాజు కాకతీయనగర్‌లో గాజుల దుకాణం నడుపుతున్నారు. వీరికి గతంలో ఓ మగబిడ్డ పుట్టి చనిపోయాడు. పూర్ణిమకు ఆడపిల్లలంటే ఇష్టం కావడంతో తనకు పాప పుట్టాలని ఆశించింది. నాలుగేళ్ల క్రితం వీరికి మరో కుమారుడు పుట్టా డు. తాజాగా 25 రోజుల క్రితం పూర్ణిమ మరో మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇద్దరు పిల్లలు ఉండటంతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవాలని శ్రీధర్‌రాజు నిర్ణయించుకున్నారు. అలా చేస్తే తనకు ఆడపిల్లను కనే అవకాశం ఉండదని పూర్ణిమ భావించింది. ఉన్న పిల్లల్లో ఒకరిని హతమారిస్తే మరో కాన్పు కోసం భర్త వేచి చూస్తారని పథకం వేసింది.

 గొంతు కోసి.. స్నాచింగ్ డ్రామా..
 మంగళవారం రాత్రి 7.30 సమయంలో చిన్న కుమారుడు(ఇంకా పేరు పెట్టలేదు) అనారోగ్యంతో ఉన్నాడని, వాంతులు అవుతున్నాయని పూర్ణిమ దుకాణంలో ఉన్న భర్తకు చెప్పి ఆస్పత్రికి తీసుకెళ్తున్నానని ఇంటి నుంచి బయలుదేరింది. కొద్దిసేపటికే భర్తకు ఫోన్ చేసిన పూర్ణిమ.. బాబును తీసుకెళ్తున్న తనపై దేవీనగర్‌లోని రామాలయం వద్ద స్నాచర్లు దాడి చేశారని, మత్తుమందు చల్లడంతో కింద పడిపోయానని చెప్పింది. తేరుకుని చూడగా పసిబిడ్డ గొంతుపై తీవ్ర గాయం కనిపించిందని విల పిస్తూ సమాచారం ఇచ్చింది. తన మెడలో ఉండాల్సిన మూడు తులాల పుస్తెలతాడు సైతం కనిపించట్లేదని నమ్మబలికింది. దీంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న శ్రీధర్.. కుమారుడిని చికిత్స నిమిత్తం తార్నాకలోని సురక్ష ఆస్పత్రికి తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ కన్నుమూయడంతో మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

 గాంధీ మార్చురీలో పోస్టుమార్టం..
 చిన్నారి మృతదేహానికి బుధవారం గాంధీ ఆస్పత్రి మార్చురీలో ఫోరెన్సిక్ వైద్యురాలు వాణిశ్రీ పోస్టుమార్టం నిర్వహించారు. చిన్నారి గొంతుకు అయిన గాయాన్ని పరీక్షించిన ఫోరెన్సిక్ వైద్యులు పదునైన ఆయుధంతో గాయం చేయడంతో నరాలు, ఇతర కండరాలు, ఊపిరి నాళం తెగినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే పూర్ణిమ ఇంట్లోనే బ్లేడుతో చిన్నారి గొంతు కోసి బయటకు తీసుకువచ్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించడంతో పాటు పుస్తెలతాడు ఏమైందనే విషయాన్నీ ఆరా తీస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం వరకు పూర్ణిమ కథనాన్నే నిజమని నమ్మిన భర్త, బంధువులు అసలు విషయం తెలిసి కన్నీరుమున్నీరవుతున్నారు.
 
 ఘటనాస్థలి పరిశీలనతో అనుమానం..
 పోలీసులకు కూడా పూర్ణిమ తదితరులు స్నాచింగ్, మత్తుమందు, గొంతుకు గాయం వంటి విషయాలనే చెప్పారు. పోలీసులు ప్రాథమిక విచారణ తర్వాత అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో పూర్ణిమ నుంచి ఫిర్యాదు స్వీకరించారు. దర్యాప్తులో భాగంగా స్నాచింగ్ జరిగినట్లు చెప్పిన దేవినగర్‌లోని రామాలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడ మత్తుమందు, రక్తం ఆనవాళ్లు కనిపించలేదు. దీనికితోడు పూర్ణిమ ఇంటి వద్ద రక్తం మరకలతో కూడిన చిన్నారి షర్టు లభించింది. దీంతో పోలీసులు పూర్ణిమ కథనాన్ని అనుమానించారు. ఓ దశలో అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించగా ఆమె బంధువుల ఇంటికి వెళ్లింది. దీంతో ఆమెపై అనుమానాలు బలపడి అదుపులోకి తీసుకుని లోతుగా విచారించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

మరిన్ని వార్తలు