ప్రసూతి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

28 Apr, 2017 00:37 IST|Sakshi
ప్రసూతి మరణాలపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం

మానవహక్కుల కమిషన్‌కు టీపీసీసీ మహిళా నేతల విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో బాలింతల వరుస మరణాలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని, సరైన వైద్యం అందించే విధంగా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మానవ హక్కుల కమిషన్‌కు టీపీసీసీ మహిళా నేతలు గురువారం విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే డీకే అరుణ, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, వి.సునీతా లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు నేరెళ్ల శారద, ఇందిరాశోభన్‌ తదితరులు మానవహక్కుల కమిషన్‌ను కలిశారు. అనంతరం అరుణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే బాలింతలు వరుసగా మృత్యువాత పడటం ఆందోళ నకరమన్నారు.

ఆస్పత్రుల్లో సదుపాయాలు లేకపోవడం, సరైన వైద్యం అందకపోవడం వల్లనే బాలింతలు చనిపోయారని అన్నారు. ఆస్పత్రులను సందర్శించడానికి ప్రత్యేక కమిటీని వేయాలని మానవహక్కుల కమిషన్‌ను కోరినట్లుగా వెల్లడిం చారు. చనిపోయిన బాలింతల కుటుంబా లకు  రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు పెంచాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్టుగా డీకే వెల్లడించారు. ఆస్పత్రులపై ప్రజల నుంచి ఫిర్యాదులు, సలహాలకోసం ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయాలని కోరారు. గాంధీభవన్‌ నుంచి మానవ హక్కుల కమిషన్‌ కార్యాల యం దాకా మహిళానేతలు ర్యాలీగా వెళ్లారు.

కేసీఆర్‌ జిందాబాద్‌ నినాదాలు
అయితే ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న సందర్భంగా మహిళా కార్యకర్తలు తడబడి, సీఎం కేసీఆర్‌ జిందాబాద్‌ అని నినాదాలు చేశారు. దీనిని గుర్తించిన మహిళానేతలు వెంటనే సవరించి, కార్యకర్తలకు సూచనలు చేశారు.

మరిన్ని వార్తలు