‘సహకార’ ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే!

8 Jan, 2018 02:26 IST|Sakshi

వచ్చే నెల 3తో ముగియనున్న గడువు

పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమించేందుకు ఏర్పాట్లు

200 ఫిషరీస్‌ సంఘాల ఎన్నికలకు రంగం సిద్ధం

సాక్షి, హైదరాబాద్‌: సహకార సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే ఆలోచన ప్రభుత్వానికి లేనట్లు అర్థమవుతోంది. వచ్చే నెల 3 నాటికి ప్రాథమిక సహకార సంఘాలు (ప్యాక్స్‌), జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాలు (డీసీఎంఎస్‌), రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంక్‌ (టెస్కాబ్‌)ల పాలకవర్గ పదవీకాలం ముగియనుంది.

అయినా ఇప్పటివరకు ప్రభుత్వం వాటికి ఎన్నికలు నిర్వహించే విషయంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా ఎన్నికల నిర్వహణకు కనీసం 2 నెలల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వాటి పదవీ కాలం ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించడం అసాధ్యమని, నూతన పాలకవర్గం కొలువుదీరే పరిస్థితి లేదని సహకార శాఖ వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

రైతులకు పెట్టుబడి సాయం తర్వాత..
రాష్టంలో 906 ప్యాక్స్, 10 డీసీసీబీలు, 9 డీసీఎంఎస్‌లు, టెస్కాబ్‌లు ఉన్నాయి. ఈ సహకార సంఘాల ఎన్నికల్లో రైతులే ఓటర్లు. కాబట్టి ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడం శ్రేయస్కరం కాదనేది సర్కారు ఆలోచనగా చెబుతున్నారు. పైగా వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే వ్యతిరేకత కనిపిస్తే ఆ ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడుతుందనేది భావిస్తున్నట్లు తెలుస్తోంది. తొలుత గ్రామాల్లో పరిస్థితిని మెరుగుపరిచి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. పెట్టుబడి కింద ఎకరాలకు రూ.8 వేల ఇవ్వనుంది. ఈ పథకం కింద 1.42 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతారు. దీన్ని అమలు చేశాక సంఘం ఎన్నికలకు వెళితే ప్రయోజనం ఉంటుందని సర్కారు భావనగా కన్పిస్తోంది.

పాలకవర్గ అధ్యక్షులే పర్సన్‌ ఇన్‌చార్జీలా
సహకార సంఘాల పదవీకాలం ముగిసే నాటికి ఎన్నికలు నిర్వహించకపోతే వాటికి పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమించాల్సి ఉంది. అందుకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. సాధారణంగా పర్సన్‌ ఇన్‌చార్జీలుగా అధికారులను నియమిస్తుంటారు. అధికారులను నియమిస్తే వ్యవస్థ మొత్తం ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది.

కానీ రాజకీయ అవసరాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటే ప్రస్తుత పాలకవర్గ అధ్యక్షులను పర్సన్‌ ఇన్‌చార్జీలుగా కూడా నియమించుకునే అవకాశం ప్రభుత్వానికి ఉందని సహకార వర్గాలు చెబుతున్నాయి. అదే జరిగితే ఇప్పుడు పాలవకర్గ అధ్యక్షులుగా ఉన్నవారు కొనసాగొచ్చు. 6 నెలల వరకే వారు కొనసాగుతారు. దీనిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. కాగా, 200 ఫిషరీస్‌ సొసైటీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించేందుకు సహకార శాఖ కసరత్తు చేస్తోంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్లు అధికారులు చెబుతున్నారు. 

మరిన్ని వార్తలు