గ్రేటర్ గ్రిడ్ కార్యాచరణేదీ..?

13 Dec, 2014 23:58 IST|Sakshi
గ్రేటర్ గ్రిడ్ కార్యాచరణేదీ..?

దాహార్తిని తీరిస్తేనే విశ్వనగర ఖ్యాతి
జిల్లాలతోపాటే నగరంలోనూ చేపట్టాలి
అప్పుడే సత్ఫలితాలు సాధ్యమంటున్న నిపుణులు
సీఎం అనుమతికోసం అధికారుల ఎదురుచూపు

 
సిటీబ్యూరో:  సర్కార్ లెక్కల ప్రకారం తెలంగాణ జనాభా నాలుగు కోట్ల పైమాటే. అందులో కోటి జనాభా రాష్ట్ర రాజధాని గ్రేటర్ పరిధిలోనే ఉంటుంది. కోటి మంది జనాభా దాహార్తి తీరిస్తేనే వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు సగం విజయవంతమైనట్టేనని నిపుణులు అంటున్నారు. మహానగరాన్ని గ్లోబల్ సిటీగా మార్చాలనుకుంటున్న సర్కార్.. గ్రేటర్ వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును శరవేగంగా పూర్తిచేస్తేనే రాబోయే నాలుగేళ్లలో ప్రతి ఇంటికీ నల్లా కనెక్షన్ ఇవ్వడం సాధ్యపడుతుందని, తద్వారా ఈ పథకం సాకారమై నగరానికి పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుందని విశ్లేషిస్తుండడం విశేషం.

ఆర్‌డబ్ల్యూఎస్‌తోపాటే చేపడితేనే సత్ఫలితాలు....

ఔటర్ రింగ్‌రోడ్డు లోపల సుమారు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు పనులను జలమండలి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇదివరకే సూత్రప్రాయంగా ప్రకటించారు. ఆ మేరకు జలమండలి రూ.13,495 కోట్ల అంచనాతో నగరంలో ప్రతి ఇంటికీ మంచినీళ్లిచ్చేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనలపై కార్యాచరణ మొదలు పెట్టేందుకు సీఎం నుంచి గ్రీన్‌సిగ్నల్ కోసం ఎదురుచూస్తోంది. ప్రస్తుతం తెలంగాణలోని పది జిల్లాల పరిధిలో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు పనులను గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్‌డబ్ల్యుఎస్)కు అప్పగించిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ప్రభుత్వం జిల్లాల్లో గ్రిడ్ పనులపైనే ప్రధానంగా దృష్టిసారించడంతో గ్రేటర్‌పై తాత్కాలికంగా ప్రతిష్టంభన నెలకొంటుందన్న సంకేతాలు వెలువడుతున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్‌ల మధ్యనున్న మహానగరానికి నీళ్లిచ్చేందుకు ఉద్దేశించిన గ్రేటర్ వాటర్‌గ్రిడ్ పథకాన్ని జిల్లా గ్రిడ్ పనులతోపాటే మొదలుపెడితేనే సర్కార్ ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని నీటిపారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. జాప్యం జరిగితే వ్యయ అంచనాలు భారీగా పెరిగి సర్కార్‌కు ఆర్థికంగా గుదిబండగా మారే ప్రమాదం ఉందని వారంటున్నారు.
 
విశ్వనగరానికి గ్రిడ్ అవసరం...

గ్రేటర్ పరిధిలో ప్రతి వ్యక్తికి నిత్యం 135 లీటర్ల చొప్పున (తలసరి నీటిలభ్యత) తాగునీరు అందించేందుకు వాటర్‌గ్రిడ్‌ను యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలి. లేకుంటే విశ్వనగర ఖ్యాతి అందుకోవడం కష్టమే. కృష్ణా మూడోదశతోపాటు నాలుగో దశ కూడా అవసరం. గోదావరి, కృష్ణా జలాలతో మహానగరంలో ప్రతి ఇంటికీ పుష్కలంగా తాగునీటిని అందించడం కష్టమేమి కాదు. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో చేపడుతున్న గ్రిడ్ పనులతోపాటు గ్రేటర్‌గ్రిడ్ పనులను తక్షణం మొదలుపెడితేనే రెండింటి మధ్య సమన్వయం ఉంటుంది.
 
- ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి, చేతనా సొసైటీ ఫర్ వాటర్
 
 

మరిన్ని వార్తలు