ఉస్మానియా కూల్చివేతపై నిర్ణయం తీసుకోలేదు

12 Aug, 2015 02:50 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా జనరల్ ఆసుపత్రిని కూల్చివేసే విషయంలో తాము ఇప్పటి వరకు ఏ నిర్ణయమూ తీసుకోలేదని టీ సర్కార్ మంగళవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు చేసిన ఈ ప్రకటనను హైకోర్టు ధర్మాసనం రికార్డు చేసుకుంది. ఈ వ్యాజ్యంలో తదుపరి విచారణ అవసరం లేదంటూ దానిని పరిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఒకవేళ ఉస్మానియా కూల్చివేతకు నిర్ణయం తీసుకుంటే ప్రజలకు తెలియచేయాలని ప్రభుత్వానికి స్పష్టం చేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ ఎస్.వి.భట్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉస్మానియా ఆసుపత్రిని కూల్చివేసి, అందులో టవర్లు నిర్మించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని, దీనిని అడ్డుకోవాలంటూ న్యాయవాది బి.ఎం.స్వామిదాస్ హైకోర్టులో దాఖలుచేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)ను ధర్మాసనం విచారించింది. పిటిషనర్ తరఫు న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఆసుపత్రి కూల్చివేతకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, అందుకే అక్కడి నుంచి రోగులను తరలిస్తోందంటూ, పత్రికల్లో వచ్చిన కథనాలను ధర్మాసనం ముందుంచారు. ధర్మాసనం వాటిని పరిశీలించింది.ఉస్మానియా కూల్చివేతపై నిర్ణయం తీసుకోలేదు

మరిన్ని వార్తలు