రేషన్ డీలర్ల అక్రమాలపై కమిటీ: పరిటాల సునీత

18 Jun, 2014 12:42 IST|Sakshi
రేషన్ డీలర్ల అక్రమాలపై కమిటీ: పరిటాల సునీత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పౌరసరఫరాల వ్యవస్థ పూర్తి అస్తవ్యస్థంగా ఉందని మంత్రి పరిటాల సునీత అన్నారు. ఈ నేపథ్యంలో పౌరసరఫరాల శాఖను సంస్కరించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రిగా పరిటాల సునీత బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ... ప్రజలకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందిస్తున్న బియ్యం బాగోవడం లేదని... ఈ నేపథ్యంలో మంచి బియం ప్రజలకు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.

 

అలాగే పీడీఎస్ కింద అందాల్సిన 9 రకాల నిత్యవసర వస్తువులు ప్రజలకు సక్రమంగా అందడం లేదని... అవి కూడా సజావుగా ప్రజలకు అందేలా చూస్తామన్నారు. రాష్ట్రంలో చాలా మంది రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని... వారిపై చర్యలు తీసుకునేందుకు త్వరలోనే ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. తప్పు చేసిన రేషన్ డీలర్లను తొలిగిస్తామన్నారు. 3 నెలలుగా పీడీఎస్ కింద్ర రాష్ట్ర ప్రజలకు పామాయిల్ అందడం లేదని... సరఫరా చేసేందుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడతాని సునీత వెల్లడించారు.

మరిన్ని వార్తలు