బడాబాబులకి దోచిపెట్టి.. భారం ప్రజలపైనా?

15 Mar, 2016 02:18 IST|Sakshi

ఏపీఈఆర్‌సీ ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజాగ్రహం

 సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పెద్దలకు కావాల్సిన వ్యక్తులకు ప్రయోజనం చేకూర్చేందుకు ప్రజలపై విద్యుత్ భారం మోపడం ఏమిటని విద్యుత్ పంపిణీ సంస్థలను ప్రజా సంఘాలు నిలదీశాయి. పంపిణీ సంస్థల నష్టాలకు ప్రైవేటు విద్యుత్ కొనుగోళ్లు కారణం కాదా అని ప్రశ్నించాయి. కాంట్రాక్టుల విషయంలో సాక్షాత్తూ సీఎంపైనే అవినీతి ఆరోపణలు వచ్చిన వైనాన్ని గుర్తుచేశాయి. రూ. 5,145 కోట్ల వార్షిక ఆర్థిక లోటు ఉన్నట్టు తూర్పు, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలు ఇటీవల ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి తెలిపాయి. దీనిని పూడ్చుకోవడానికి విద్యుత్ చార్జీల పెంపునకు అనుమతినివ్వాలని కోరాయి. ఈ నేపథ్యంలో ఏపీఈఆర్‌సీ కార్యాలయంలో సోమవారం బహిరంగ ప్రజా విచారణ జరిగింది. ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాలు, విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు. ఏపీఈఆర్‌సీ చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కమిషన్ సభ్యులు రఘు, రామ్మోహన్ పాల్గొన్నారు.

 సీఎంపైనే అవినీతి ఆరోపణలు: జెన్‌కో ప్రాజెక్టుల ఈపీసీ కాంట్రాక్టు వ్యవహారంలో అవకతవకలు చోటు చేసుకున్నాయని సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్ పేర్కొన్నారు. సోలార్ ప్రాజెక్టులు ప్రభుత్వంలో ఉన్న పెద్దలవి కావా? అని ప్రశ్నించారు. సీఎంపైనే అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు.

మరిన్ని వార్తలు