జనంపై భారం లేదు 

10 Nov, 2023 05:12 IST|Sakshi

2025 నాటికి స్మార్ట్‌ మీటర్లు కేంద్ర ఎలక్ట్రిసిటీ అథారిటీ నిబంధన

దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాలు ఈ పనులు చేపట్టాయి

‘ఆర్‌డీఎస్‌ఎస్‌’ పధకంతో మీటరుకు రూ.1,350 వరకు గ్రాంటు 

రూ.20వేల కోట్ల భారమంటూ కాకి లెక్కలతో  ‘ఈనాడు’ గగతప్పుడు కథనం 

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో స్మార్ట్‌ మీటర్ల ప్రక్రియ కొనసాగుతుంటే ఏపీ మినహా మరెవరూ స్మార్ట్‌ మీటర్లు అమర్చడం లేదంటూ నిస్సిగ్గుగా అబద్ధాలను అచ్చేస్తోంది ఈనాడు. ప్రభుత్వ, వాణిజ్య, పారిశ్రామిక సర్వీసులకు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తుంటే ‘జనం జేబుకు చిల్లు‘ అంటూ వక్ర భాష్యాలు చెబుతోంది. ఆ కథనంలో దాచి­పెట్టిన వాస్తవాలను ఆంధ్రప్రదేశ్‌ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థల (డిస్కమ్‌లు) సీఎండీలు ఐ.పృధ్వీతేజ్, జె.పద్మజనార్దనరెడ్డి, కె.సంతోషరావు గురువారం ‘సాక్షి’కి వెల్లడించారు. 

  విద్యుత్‌ పంపిణీ నష్టాల తగ్గింపు చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ 2025 నాటికి ప్రతి సర్వీసు, ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్లు అన్నిటికి స్మార్ట్‌ మీటర్లను అమర్చాలనే నిబంధన విధించాయి. వినియోగదారులపై ఎటువంటి అదనపు భారం లేకుండా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ పధకాన్ని రూపొందించారు. ఈమేరకు దేశవ్యాప్తంగా డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగానే టెండర్‌ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోంది. 

   రాష్ట్రంలో 200 యూనిట్లు అంతకుమించి వాడ­కం ఉన్న సర్వీసులకు, ప్రభుత్వ సర్వీసులకు డిస్కమ్‌లు స్మార్ట్‌ మీటర్లు ఏర్పాటు చేస్తాయి. తద్వారా పేద, మధ్య తరగతిపై భారం లేకుండా చర్యలు తీసుకున్నాయి. ప్రీపెయిడ్‌ మీటర్లలో కొత్త టెక్నాలజీ ద్వారా అనేక ప్రయోజనాలు­న్నా­యి. బిల్లును ఎప్పటికప్పుడు తెలుసుకో­వచ్చు. ఒకేసారి కాకుండా అవసరాన్ని బట్టి చెల్లించవచ్చు. విద్యుత్‌ సరఫరా చేసే సమయం, నా­ణ్య­తను తెలుసుకునే వీలుంది. విద్యుత్‌ చౌ­ర్యా­న్ని అరికట్టవచ్చు. డబ్బులు కట్టలేదని లైన్‌మెన్‌ కరెంట్‌ నిలుపుదల చేసే పరిస్థితి ఉండదు. ప్రమా­దా­లు కూడా గణనీయంగా తగ్గుతాయి. ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకంలో భాగంగా స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటుకు 2025 మార్చి వరకు గడువు ఉంది. రెండు నెలల వ్యవధిలో ఏర్పాటు చేయాలన్నది అవాస్తవం.

 దేశంలో 19.792 కోట్ల మంది వినియోగదారులకు స్మార్ట్‌ మీటర్లను అమర్చేందుకు ఆమోదం లభించింది. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్‌ఘడ్, బిహార్, అసోం, మణిపూర్, ఆంధ్రప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, త్రిపురలో 7.517 కోట్ల స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు టెండర్లను ఖరారు చేశారు. బిగించే ప్ర­క్రియ కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతోంది. 

  మన రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు, వాణిజ్య భవనాలకు, పారిశ్రామిక వినియోగదారులకు, విద్యుత్‌ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు, 11 కేవీ ఫీడర్లకు కలిపి 42 లక్షల స్మార్ట్‌ మీటర్లను బిగించేందుకు డిస్కమ్‌లు చర్యలు చేపట్టాయి. ఒక్కో సింగిల్‌ ఫేజ్‌ మీటర్‌కు నెలకు రూ.86.32, త్రీ–ఫేజ్‌ మీటర్‌కు రూ.176.02 చొప్పున 93 నెలల వ్యవధిలో టెండర్‌ దక్కించుకున్న సంస్థలకు చెల్లించాల్సి ఉంటుంది. స్మార్ట్‌ మీటర్ల ఏర్పాటు, పదేళ్ల పాటు నిర్వహణకు రూ.5 వేల కోట్లు వ్యయం కానుంది. అయితే ఆర్‌డీఎస్‌ఎస్‌ పథకం ద్వారా మీటరుకు రూ.1,350 వరకు కేంద్రం గ్రాంట్‌ ఇస్తుంది. ఇదంతా వదిలేసి రూ.20 వేల కోట్ల భారమంటూ ‘ఈనాడు’ కాకి లెక్కలతో తప్పుడు రాతలను అచ్చేసింది. 

మరిన్ని వార్తలు