పెద్ద ఎత్తున రేషన్ సరుకుల పట్టివేత

2 Sep, 2015 21:24 IST|Sakshi

పహాడీషరీఫ్: రేషన్ బియ్యాన్ని నల్లబజార్‌కు తరలించేందుకు నిల్వ ఉంచిన గోదాముపై సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు బుధవారం దాడులు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రేషన్ సరుకులను స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. ఇసామియా బజార్‌కు చెందిన శంకర్ లాల్ అనే వ్యక్తి సరూర్‌నగర్ మండలం కొత్తపేట పంచాయతీ ఫాతిమానగర్‌లో ఓ గోదాము తీసుకొని రేషన్ సరుకులను నిల్వ ఉంచుతున్నాడు. బాలాపూర్‌కు చెందిన మధు కిరణ్, రాంబాగ్‌కు చెందిన రాజు కమల్ అనే వారు నగరంలోని వివిధ రేషన్ దుకాణాల నుంచి సరుకులు తీసుకొచ్చి ఇక్కడ వేయడంతో పాటు, బ్లాక్ మార్కెట్‌కు తరలిస్తుంటారు.

విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్లు నర్సింగ్‌రావు, రంగ స్వామి, ఎస్సైలు ఆంజనేయులు, రమేష్ బుధవారం సాయంత్రం ఆ గోదాముపై దాడులు చేశారు. ఈ దాడులలో శంకర్ లాల్, మధుకిరణ్, రాజు కమల్‌తో పాటు డీసీఎం డ్రైవర్ గఫార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతోపాటు గోదాములో నిల్వ ఉంచిన 228 క్వింటాళ్ల బియ్యం, 21 క్వింటాళ్ల చక్కెర, 17.5 క్వింటాళ్ల గోధుమలు, మూడున్నర క్వింటాళ్ల కందిపప్పు, రెండు క్వింటాళ్ల ఉప్పు, రూ. లక్ష నగదు, నాలుగు సెల్‌ఫోన్లు, డీసీఎం, స్కూటీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తదుపరి విచారణ నిమిత్తం పహాడీషరీఫ్ పోలీసులకు అప్పగించారు.

మరిన్ని వార్తలు