జిల్లాల పునర్విభజనపై నేడే అఖిలపక్షం

20 Aug, 2016 03:05 IST|Sakshi
జిల్లాల పునర్విభజనపై నేడే అఖిలపక్షం

సచివాలయంలో ముఖ్యమంత్రి నేతృత్వంలో సమావేశం
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుపై మరో అంకానికి తెరలేస్తోంది. ఈ అంశంపై ఆయా రాజకీయ పార్టీల సూచనలు తీసుకునేందుకు శనివారం సచివాలయంలో ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాల్గొంటున్న ఈ సమావేశంలో జిల్లాలపై ఏర్పాటైన మంత్రుల సబ్ కమిటీతోపాటు ఒక్కో రాజకీయ పార్టీ నుంచి ఇద్దరు చొప్పున ప్రతినిధులు పాల్గొంటున్నారు.

ప్రభుత్వం ఇచ్చిన ఆహ్వానం మేరకు టీఆర్‌ఎస్ నుంచి రాష్ట్ర ప్రణాళిక మండలి ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి మల్లు భట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, టీడీపీ నుంచి ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, బీజేపీ నుంచి రామచంద్రరావు, మల్లారెడ్డి, సీపీఎం నుంచి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి, పల్లా వెంక ట్‌రెడ్డి హాజరవుతున్నారు. ఆయా రాజకీయ పక్షాలు తమ ఎజెండాల తో ఈ భేటీకి హాజరయ్యేందుకు సిద్ధమయ్యాయి. కాగా అఖిలపక్ష భేటీకి ఆహ్వానం అందకపోవడంతో నిరసన తెలిపేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమవుతోంది.
 
మార్గదర్శకాల కోసం పట్టుపట్టనున్న కాంగ్రెస్
జిల్లాల ఏర్పాటుకు మార్గదర్శకాలు, ప్రాతిపదిక ఏమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమైంది. జిల్లాల ఏర్పాటు ప్రజల అవసరాల కోసం జరగాలని స్పష్టం చేయనుంది. మార్గదర్శకాలను ప్రకటించి, వాటి అమల్లో రాజకీయాలకు తావులేకుండా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యవహరించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన యంత్రాంగం ఏమిటో చెప్పాలని కోరనుంది. ముఖ్యంగా మార్గదర్శకాలను నిష్పక్షపాతంగా అమలుచేయడానికి జ్యుడీషియల్ కమిషన్‌కు అప్పగించాలని డిమాండ్ చేయనున్నట్లు తెలుస్తోంది.
 
ప్రజల సౌలభ్యమే.. అంటున్న బీజేపీ
కొత్తగా జిల్లాల ప్రతిపాదనల్లో ఆయా జిల్లాల జనాభా, భౌగోళిక స్వరూపం, రవాణా సౌకర్యాలు, జిల్లా కేంద్రానికి దూరం, చారిత్రక నేపథ్యం, వనరులు, నీటివసతి వంటివాటిపై ప్రజల అభిప్రాయాలను, సౌలభ్యాన్ని ప్రశ్నిం చడానికి బీజేపీ సన్నద్ధమవుతోంది. జిల్లాల ఏర్పాటు కృత్రిమంగా, రాజకీయ, తాత్కాలిక అవసరాల కోసం కాకుండా చూడాలని.. ప్రజా ప్రయోజనాలు అంతిమంగా ఉండాలని పట్టుబట్టనుంది. వరంగల్ పట్టణాన్ని రెండుగా విభజిస్తూ... హన్మకొండను మరో జిల్లాగా చేయడాన్ని అక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారని ఆ పార్టీ పేర్కొంటోంది.

చారిత్రక నేపథ్యమున్న వరంగల్‌ను విడదీయడాన్ని వ్యతిరేకించే యోచనలో ఉంది. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో ఇతర జిల్లాలకు చెందిన మండలాలను కలిపే విషయంలో, రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లను వికారాబాద్‌లో కాకుండా శంషాబాద్‌లో కలపాలనే డిమాండ్‌ను ప్రభుత్వం దృష్టికి తీసుకురానుంది.
 
అసంపూర్తిగా సమాచారం
‘‘కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం పంపించిన సమాచారం అసంపూర్తిగా ఉంది. హైద రాబాద్ జిల్లా సమాచారమే లేదు. ఏ జిల్లాలో ఎంత జనాభా ఉంటుందనే దానిపై స్పష్టత కొరవడింది. అసెంబ్లీ నియోజకవర్గాలను ముక్కలుగా చేయొద్దు. జిల్లా కేంద్రం మధ్యలో ఉండాలి. శాస్త్రీయంగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని విభజించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ప్రజెంటేషన్‌ను బట్టి మా పార్టీ స్పందన ఉంటుంది..’’    
 - చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
 
చెబుతున్నదొకటి.. చేస్తున్నదొకటి
‘‘కొన్ని మండలాల ఏర్పాటు ప్రతిపాదనలు సమగ్రం గా లేవు. గిరిజన ప్రాంతాలను కలిపి ప్రత్యేకంగా కౌన్సిల్ ఉండాలి. జిల్లా కేంద్రం విషయంలో ప్రభుత్వం చెబుతున్న వాదన, వాస్తవ ప్రతిపాదనల్లో తేడాలున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ కలసి ఉండాలని చెబుతున్న ప్రభుత్వం.. వరంగల్, హన్మకొండలను ఎలా విడదీస్తోంది? అఖిలపక్షంలో వచ్చే ప్రతిపాదనలు, అభిప్రాయాలకు అనుగుణంగా మా వాదన వినిపిస్తాం..’’    
- తమ్మినేని వీరభద్రం, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
 
రాజకీయ లబ్ధికోసమే..
‘‘కేవలం రాజకీయ లబ్ధి కోసమే జిల్లాల పునర్విభజన చేస్తున్నట్లు అనిపిస్తోంది. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే జిల్లాల విభజన ఉంటుందని సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కానీ దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా జిల్లాల విభజన ఉండాలి..’’    
- ఎల్.రమణ, టీ టీడీపీ అధ్యక్షుడు

మరిన్ని వార్తలు