ఏపీలోని ఆలయాల్లో బాణాసంచాపై నిషేధం

13 Apr, 2016 20:38 IST|Sakshi
బాణాసంచా పేలుడు ధాటికి ధ్వంసమైన కొల్లాం ఆలయం (ఫైల్ ఫొటో)

హైదరాబాద్: కొల్లాం ఆలయంలో చోటుచేసుకున్న పెను విషాదం నుంచి అన్ని రాష్ట్రాలూ పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఈ క్రమంలో ముందడుగు వేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో బాణాసంచా వినియోగాన్ని నిషేధించింది. ఇక నుంచి ఏ గుడిలో ఎలాంటి ఉత్సవం జరిపినా ఆ సందర్భంగా పటాకులు పేల్చే కార్యక్రమాన్న చేపట్టవద్దని రాష్ట్ర ప్రభుత్వం దేవాదాయ శాఖ అధికారులను ఆదేశిచింది. ఒకవేళ ఏదైనా ఉత్సవంలో బాణాసంచా ఉపయోగించడం తప్పనిసరి ఆచారమైతే, అలాంటి సందర్భంలో జిల్లా ఉన్నతాధికారుల నుంచి అనుమతి తీసుకోవాలని సర్కారు సూచించింది. ఈ మేరకు దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

నాలుగు రోజుల కిత్రం కేరళలోని కొల్లం జిల్లాలో పుట్టింగల్ అమ్మవారి ఆలయ ఉత్సవంలో బాణా సంచా పేల్చుతూ అగ్ని ప్రమాదం చోటుచేసుకొని వంద మందిపైగా మృతి చెందడంతో ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల్లో భద్రతా చర్యలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఏడాదికి రూ. 25 వేలకు పైబడి ఆదాయం ఉండే ఆలయంలో అగ్ని ప్రమాద నివారణకు స్థానిక ఆలయ అధికారులు జిల్లా ఫైర్ ఆఫీసర్ సూచనల అమలు చేయాలని ఆదేశించారు.

అన్నదాన, ప్రసాద పాకశాల వద్ద పందిళ్ల ఏర్పాటుపై ఆలయ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని.. రథోత్సవం, దీపోత్సవం, తెప్పోత్సవం వంటి కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి ప్రమాదాలకు అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు చేపట్టాలని ఉత్తర్వుల్లో స్పష్టంగా చేశారు. టీటీడీ పరిధిలో సైతం అగ్నిప్రమాదాల నివారణ విషయంలో అక్కడి ఈవో ప్రస్తుత పరిస్థితులపై మరోసారి పూర్తి స్థాయి సమీక్ష జరిపి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది.

మరిన్ని వార్తలు