బాబుకు 'బ్రాండ్‌‌' బాజాపై సెగలు! | Sakshi
Sakshi News home page

బాబుకు 'బ్రాండ్‌‌' బాజాపై సెగలు!

Published Wed, Apr 13 2016 8:32 PM

బాబుకు 'బ్రాండ్‌‌' బాజాపై సెగలు! - Sakshi

హైదరాబాద్: సొంత రాష్ట్రం ప్రతిభా పాటవాలకన్నా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ మోజు, పరాయి ప్రభావం కోసం వెంపర్లాడటం ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. గడిచిన రెండేళ్లుగా ప్రతి విషయంలోనూ చంద్రబాబు ఇలాంటి వైఖరినే అవలంబిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రం నుంచి జాతీయ స్థాయి ప్రశంసలు అందుకున్న సినిమా తారలున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్ గా బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, ఆయన భార్య కాజోల్ ను అంగీకరించిన చంద్రబాబు వైఖరి ఇక్కడి సెలబ్రిటీలకు ఆగ్రహం తెప్పిస్తోంది.

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అవసరమైన మాస్టర్ ప్లాన్ సమకూర్చుతామని విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (స్పా) చెప్పడమే కాకుండా అత్యద్భుతమైన ప్రణాళికలు ఇచ్చినప్పటికీ చంద్రబాబు మాత్రం వాటిని ఏమాత్రం ఖాతరు చేయకుండా మాస్టర్ ప్లాన్ ల పేరుతో వాటిని సింగపూర్ కు చెందిన ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు అప్పగించారు. కీలకమైన రాజధాని విషయంలోనే కాకుండా అనేక ఇతర నిర్ణయాల్లోనూ ఆయన విదేశీ, పరాయి సంస్థల కోసమే తాపత్రయపడుతున్నారు.

చంద్రబాబు అనేక విషయాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అనుకరించే ప్రయత్నం చేస్తున్నారు. అలా అనుకరించినప్పటికీ తాను వారికన్నా పైన ఉండాలన్న తాపత్రయంతో సొంత ఇమేజీని డ్యామేజీ చేస్తున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. తెలుగు ప్రతిష్టను కాపాడుతానని చెబుతున్న చంద్రబాబు ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ను ఇంగ్లీషు భాషలో ప్రవేశపెట్టించడం, హైదరాబాద్ లో జరిగిన న్యాయమూర్తుల సదస్సులో కేసీఆర్ తెలుగులో ప్రసంగిస్తే చంద్రబాబు మాత్రం ఇంగ్లీషులో ప్రసంగించడం విమర్శలకు దారితీసింది. ఈ విషయాలపై పలువురు నిపుణులు ఇప్పటికే ప్రశ్నించారు కూడా.

కేసీఆర్ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా స్వరాష్ట్రానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఏపీకి తానే బ్రాండ్ అంబాసిడర్ నని ప్రకటించుకున్న చంద్రబాబు ఉన్నట్టుండి బాలీవుడ్ జంట అజయ్ దేవగణ్- కాజోల్ ను అంగీకరించడంలోని ఆంతర్యమేంటన్న ప్రశ్న అందరిలోనూ ఉదయిస్తోంది. వీరిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించడంలో ఏదో మతలబు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పైగా, స్వరాష్ట్రానికి చెందిన ఎంతో మంది ప్రముఖులు, సినీ తారలు ఉన్నప్పటికీ హిందీ చలనచిత్ర పరిశ్రమకు చెందిన వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా ఎంచుకోవడం ఇక్కడి సినీ పరిశ్రమ వర్గాలను విస్మయానికి గురిచేసింది.
 

Advertisement
Advertisement