అదో దుర్మార్గమైన చట్టం

22 Mar, 2016 05:41 IST|Sakshi
అదో దుర్మార్గమైన చట్టం

- విద్యా హక్కు చట్టంపై సీఎం కేసీఆర్
- ప్రైవేటు స్కూళ్లలో పేద వర్గాలకు 25 శాతం రిజర్వేషన్ ఇస్తే ప్రభుత్వ బడులేం కావాలి?
- విద్యాహక్కు చట్టం అమలు చేస్తే 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు పనుండదు

- యూపీఏ దుర్మార్గమైన చట్టం చేసి పోయింది
- విద్యా విధానం అమలుపై సమగ్ర చర్చ జరగాలి
- సభలో దీనికోసం సగం రోజు సమయం కేటాయించాలి

- విద్యను మొత్తం ఒకే గొడుగు కిందికి తీసుకురావాలి
- ఏప్రిల్ నాటికి ‘ఫీజు’ బకాయిలు ఉండకుండా చూస్తామని వెల్లడి


సాక్షి, హైదరాబాద్:
విద్యాహక్కు చట్టం అమలు చేసి, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం పేద విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తే 40 వేల మంది ప్రభుత్వ టీచర్లకు పనుండదని... యూపీఏ ప్రభుత్వం పోతూపోతూ దుర్మార్గమైన చట్టం చేసి పోయిందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ఎంతమందికి ఉపయోగం, ఏం చేయాలనే దానిపై సమగ్ర చర్చ జరగాలని చెప్పారు.

 

అవసరమైతే అందుకోసం సగం రోజు సభా సమయాన్ని కేటాయించాలని, దీనితో పాటు వైద్యం విషయంలోనూ చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. సోమవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో ప్రైవేటు పాఠశాలలు, ఫీజులపై ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, కె.లక్ష్మణ్, ఆర్.కృష్ణయ్య అడిగిన ప్రశ్నలకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సమాధానమిచ్చినా... సభ్యులు సంతృప్తి చెందకపోవడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకుని వివరణ ఇచ్చారు.

‘‘కేంద్రంలో అధికారం మారినప్పుడల్లా విద్యకు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, కొత్త ప్రభుత్వం రాగానే వాటిని వదిలేయడం జరుగుతోంది. యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు మోడల్ స్కూల్‌లను తీసుకొచ్చి 3వేల మంది టీచర్లను నియమించింది. ఎన్డీయే ప్రభుత్వం వచ్చాక ఆ పథకాన్ని ఎత్తేశారు. దీంతో మోడల్ స్కూళ్ల నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వాల మీద పడింది..’’ అని కేసీఆర్ చెప్పారు. విద్య విషయంలో నెలకొన్న సమస్యలను అందరం కలసి సమూలంగా చర్చించాలని, విద్యాహక్కు చట్టం ఎంత వ రకు ఉపయోగం? ఏం చేయాలనే దానిపై ఓ నిర్ణయానికి రావాలని ఉందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలి..
విద్యా హక్కు చట్టంలో పేర్కొన్నట్లుగా పేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో  25 శాతం సీట్లు ఇస్తే ప్రభుత్వ పాఠశాలలు ఏం కావాలని.. దానివల్ల 50 నుంచి 60 శాతం పాఠశాలల మీద ప్రభావం పడుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగుల్లో 1.50 లక్షల మంది టీచర్లేనని, అందులో 40 వేల మంది టీచర్లకు పని లేకుండా పోతుందని వ్యాఖ్యానించారు. ‘‘ఈ అంశంపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కూడా ఈ విషయంలో రిక్వెస్ట్ చేశాం. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 9 మంది విద్యార్థులకు ఐదుగురు టీచర్లున్న పరిస్థితి. ప్రైవేటు విద్యా సంస్థల్లో 25 శాతం మందిని చేర్పించి ప్రభుత్వం ఫీజు చెల్లిస్తే ప్రభుత్వ స్కూళ్లకు ఎవరొస్తారు?..’’ అని కేసీఆర్ ప్రశ్నించారు.

కొత్తగా 70 మైనారిటీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నామని, ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలోని ఎస్సీ, ఎస్టీ గురుకులాలు బాగా పనిచేస్తున్నాయని ప్రశంసించారు. సాంకేతిక, వృత్తివిద్య మినహా మిగతా విద్యా విధానాన్ని పూర్తిగా ఒకే గొడుగు కిందికి తీసుకువస్తే బాగుంటుందన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను మార్చి, ఏప్రిల్‌కల్లా పూర్తిగా చెల్లించాలని ఆర్థిక శాఖకు సూచించినట్లు తెలిపారు. విద్యా విధానంపై సభలో సమగ్ర చర్చ జరగాలన్నారు. సగం రోజు విద్యా విధానంపై, గంట సేపు వైద్యంపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని సభాపతి మధుసూదనాచారికి సూచించారు. గుర్తింపు లేని పాఠశాలల అంశంతో పాటు కేంద్రంలో ఉన్న విద్యా సంబంధమైన పథకాలు, వాటి అమలు తీరుపై సభ్యులు చర్చించి ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు.

మరిన్ని వార్తలు