స్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం

14 May, 2014 01:25 IST|Sakshi
స్టేషన్‌లో భద్రత కట్టుదిట్టం

 సికింద్రాబాద్, న్యూస్‌లైన్: వేసవి ప్రయాణాల నేపథ్యంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. గతంలో స్టేషన్‌లోకి సైకో ప్రవేశించి ఏడేళ్ల బాలికను దారుణంగా హతమార్చడం, పలు ప్రాంతాల్లో రైళ్లలో మూకుమ్మడి దొంగతనాలు, బాంబు పేలుళ్లు వంటి ఘటనల నేపథ్యంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. నిత్యం లక్షన్నరకు పైగా ప్రయాణికులు,  రెండు వందల రైళ్లు రాకపోకలు సాగించే స్టేషన్ నుంచి వేసవి సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

నేరాలు జరగకముందే అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులను పసిగట్టడం కోసం అదనపు సిబ్బందిని నియమించారు. ప్రయాణికులు పాటించాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కలిగిస్తున్నారు. జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌కు చెందిన సాయుధ సిబ్బంది రైల్వేస్టేషన్ అంతటా పహారా కాస్తున్నారు. స్టేషన్ లోపలా బయటా.. అన్ని ద్వారాల వద్దా సీసీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లతో నిఘా పెట్టారు. పాతనేరస్తులు, చైన్ స్నాచర్లు, జేబు దొంగలను గుర్తించే పనిలోపడ్డారు.
 
 క్రాసింగ్‌ల వద్ద ట్రాక్ పోలీసింగ్..
 రైల్వేలెవల్ క్రాసింగ్‌లు, ట్రాక్‌ల మలుపులు, రైళ్లు నెమ్మదిగా నడిచే ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ట్రాక్ పోలీసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఆయా ప్రాంతాల్లో నేరగాళ్లు తిష్టవేసి రైలు నెమ్మదిగా నడుస్తున్న సమయాల్లో లోనికి ప్రవేశించడం లేదా రైళ్లలో నేరాలకు పాల్పడి బోగీ నుంచి దూకి పారిపోవడం వంటి కృత్యాలకు నేరగాళ్లు పాల్పడుతున్న నేపథ్యంలో వీటిని నిరోధించేందుకు చర్యలు తీసుకున్నారు. రైలు ప్రయాణాలు చేసేవారు అప్రమత్తంగా ఉండి తమకు సహకరించాలని రైల్వే పోలీసులు కోరుతున్నారు. రైలులో అనుమానాస్పద వ్యక్తుల సంచారం, వస్తువులు కనిపించినా వెంటనే సమాచారం అందించాలని సూచించారు.

మరిన్ని వార్తలు