పీఎంవోకు ప్రధాని వీడ్కోలు | Sakshi
Sakshi News home page

పీఎంవోకు ప్రధాని వీడ్కోలు

Published Wed, May 14 2014 1:16 AM

పీఎంవోకు ప్రధాని వీడ్కోలు - Sakshi

ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన మన్మోహన్
 17న కేబినెట్ చివరి భేటీ, రాష్ర్టపతి విందు
 మన్మోహన్ మంచి వ్యక్తి: అరుణ్ జైట్లీ

 
 న్యూఢిల్లీ: యూపీఏ-2 పాలన ముగింపునకు గడువు దగ్గరపడుతుండటంతో ప్రధాని మన్మోహన్‌సింగ్ అందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే ఢిల్లీలో ఉండటానికి ఇల్లు వెతుక్కొని పెట్టుకున్న మన్మోహన్.. మంగళవారం తన కార్యాలయ సిబ్బంది నుంచి సెలవు తీసుకున్నారు. ఇంతకాలం తనకు సాయపడినందుకు ప్రతి ఒక్కరికీ అభివాదం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని కార్యాలయంలోని 110 మందికి విడివిడిగా అభినందనలు తెలిపినట్లు అక్కడి వర్గాలు పేర్కొన్నాయి. ఈ సందర్భంగా పార్లమెంట్ కాంప్లెక్స్‌లోని పరిపాలనా విభాగమైన సౌత్‌బ్లాక్‌లోని 400 మందికిపైగా ఉద్యోగులు మన్మోహన్‌కు ఘనంగా వీడ్కోలు పలికారు. సౌత్‌బ్లాక్ కారిడార్లకు చేరుకుని చప్పట్లు కొడుతూ ప్రధానికి అభినందనలు తెలిపారు. 2004 నుంచి ప్రధాని మన్మోహన్‌తో అల్లుకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

కాగా, శనివారం ఆయన తన కేబినెట్ చివరి భేటీ నిర్వహించనున్నారు. ఆ తర్వాత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీని కలవనున్నారు. రాష్ర్టపతి భవన్ నుంచి వచ్చిన తర్వాత జాతినుద్దేశించి మాట్లాడుతారు. అదే రోజు తన సహచర మంత్రులకు ప్రధాని తేనీటి విందు ఇస్తారని సమాచారం. ఇక శనివారం రాత్రి రాష్ర్టపతి వారికి విందు ఇవ్వనున్నారు. శుక్రవారమే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడనున్న సంగతి తెలిసిందే. మరోవైపు నిన్నమొన్నటి వరకు రాజకీయంగా ప్రధానిపై కత్తులు దూసిన బీజేపీ అగ్రనేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అరుణ్ జైట్లీ మంగళవారం మన్మోహన్‌ను పొగడ్తల్లో ముంచెత్తారు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచి వ్యక్తి అని కొనియాడారు. ఏ పని చేసినా అన్ని వివరాలు పక్కాగా తెలుసుకుని సర్వసన్నద్ధమవుతారని జైట్లీ కితాబిచ్చారు. పదేళ్లపాటు ప్రభుత్వానికి నేతృత్వం వహించి ఆయన హుందాగా వెళ్లిపోతున్నారని, అపార అనుభవం గల మన్మోహన్ భవిష్యత్తులోనూ జాతికి మార్గదర్శకంగా ఉంటారని ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రధాని బాధ్యతలు చేపట్టిన పరిస్థితుల దృష్ట్యా కొన్ని పరిమితులకు లోబడి పనిచేయాల్సి వచ్చిందని తన బ్లాగులో పేర్కొన్నారు. విషయ పరిజ్ఞానం, వ్యక్తిగత నిబద్ధతలో ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. వ్యక్తిగతంగా తమ మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా జైట్లీ గుర్తు చేసుకున్నారు.

 సోనియా విందు: కాంగ్రెస్ కూడా మన్మోహన్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. అనేక క్లిష్ట పరిస్థితుల్లోనూ ఆయన దేశాన్ని ముందుకు నడిపించారని కొనియాడింది. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రధాని బృందానికి మంగళవారం వీడ్కోలు విందు ఇచ్చారు. ఏఐసీసీ తరఫున ఆయనకు పార్టీ నేతలంతా కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు, కేంద్ర మంత్రులు సంతకం చేసిన ఓ జ్ఞాపికను మన్మోహన్‌కు బహూకరించినట్లు సమాచారం. ప్రస్తుత ప్రధానికి వీడ్కోలు పలకడమంటే మళ్లీ తాము అధికారంలోకి రాబోమన్నట్లు కాదని, మళ్లీ యూపీఏ ప్రభుత్వమే వస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ వ్యాఖ్యానించారు.
 
 

Advertisement
Advertisement