చెరబట్టాడు.. చంపేశాడు..

9 Sep, 2017 02:09 IST|Sakshi
చెరబట్టాడు.. చంపేశాడు..
నయీమ్‌ దుర్మార్గాలపై వెలుగులోకి మరిన్ని సంచలనాలు
- బాలికలు, యువతుల జీవితాలను బలితీసుకున్న గ్యాంగ్‌స్టర్‌
- దగ్గరి బంధువుల పిల్లలనూ వదలని దుర్మార్గం
- తన మాట వినకపోతే దారుణంగా హింసించిన వైనం
- చివరికి నిద్రమాత్రలిచ్చి, గొంతు నులిమేసి హత్యలు
- ఈ పైశాచిక ఆనందానికి తోడ్పడిన నయీమ్‌ భార్య, అత్త, అక్క
- దందాలు, సెటిల్మెంట్ల సమయంలో రక్షణగా పసికందులు
- నెలల వయసున్న చిన్నారులను కొనుక్కువచ్చి వినియోగం
- ప్రస్తుతం రెస్క్యూ హోంలో ఉన్న 30 మంది చిన్నారులు!
- వారిని తీసుకెళ్లేందుకు ముందుకురాని తల్లిదండ్రులు
 
సాక్షి, హైదరాబాద్‌: హత్యలు, బెదిరింపులు, సెటిల్‌మెంట్లతో ఆగని గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌ మరెన్నో పాశవిక చర్యలకు పాల్పడ్డాడు. తన పైశాచిక ఆనందం కోసం అభం శుభం తెలియని బాలికలు, యువతులను చెరబట్టా డు. పెంచి, పోషిస్తానని, చదివిస్తానని చెప్పి తీసుకువచ్చి అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. కాదన్న వారిని క్రూరంగా హింసించాడు. చివరికి నిద్ర మాత్రలు ఇచ్చి, కాలితో గొంతు నులిమి చంపేశాడు. నయీమ్‌ అత్త, భార్య, అక్క, మేనకోడలు ఈ దారుణాలకు తోడ్పడ్డారు. ఇక తన దందాల సమయంలో పట్టుబ డకుండా ఉండేందుకు, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు నెలల పసికందులను వినియోగించుకున్నాడు. నయీమ్‌ అనుచరులను, కుటుంబ సభ్యులను విచారిస్తున్న సమయంలో ఇలాంటి విస్తుపోయే దారుణాలెన్నో బయటపడుతున్నాయి.
 
విచ్చలవిడిగా దుర్మార్గం..
తన పైశాచిక ఆనందాన్ని తీర్చుకోవడం కోసం నయీమ్‌ అత్యంత దుర్మార్గంగా వ్యవహరించాడు. బయటివారైతే విషయం బయటకు వెళతాయన్న ఉద్దేశంతో అమ్మాయిలను తెచ్చి ఇంట్లోనే పెట్టుకున్నాడు. చదివిస్తానని, ఉద్యో గం చేయిస్తానని చెప్పి తెప్పించుకున్నాడు. తాను ఎటు వెళ్లినా వారిని తీసుకువెళుతూ కామ వాంఛలను తీర్చుకున్నాడు. ఒప్పుకోకుంటే తీవ్రంగా హింసించేవాడు, హతమార్చేవాడు.
2006లో నయీమ్‌ తన దగ్గరి బంధువులకు చెందిన నలుగురు బాలికలను పెంపకం పేరుతో తీసుకువచ్చి, లైంగికంగా వేధించాడు. వారిని కాపాడేందుకు యత్నించిన అనుచరుడు ఆరీఫ్‌ను దారుణంగా చంపేశాడు.
2008లో గోవాలో ఇల్లు కొనుగోలు చేసిన నయీమ్‌.. తరచూ హైదరాబాద్‌లోని వైట్‌ హౌజ్‌ ఇంట్లో ఉన్న ఆరుగురు 14 ఏళ్ల బాలి కలను అక్కడికి తీసుకెళ్లి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. వాళ్లు వెళ్లేందుకు ఇష్టపడకపోతే నయీమ్‌ భార్య, అక్క వారిని కొట్టి మరీ బలవంతంగా పంపించేవారు.
2010లో బంధువులకు చెందిన 17 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేశాడు.
2012 ఆగస్టులో షాద్‌నగర్‌లోని ఇంట్లో 12 ఏళ్ల బాలికను తీవ్రంగా గాయపరిచి మరీ అత్యాచారం చేశాడు. అదే సంవత్సరం నవంబర్‌లో మరో 14 ఏళ్ల బాలికను రెండు రోజుల పాటు లైంగికంగా వేధించాడు. కొద్దిరోజులకు నయీమ్‌ సొంత చిన్నాన్న బంధువులైన 12 ఏళ్ల ముగ్గురు బాలికలను మూడు రోజుల పాటు బంధించి అత్యాచారం చేశాడు.
2013లో 15 ఏళ్ల ఇద్దరు బాలికలను, 2014 లో ముగ్గురిని తన దుశ్చర్యలకు బలిచేసినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది.
 
తమ్ముడితో కలసి భర్తను చంపింది
నయీమ్‌ ఎంచుకున్న దారిలోనే నడిచిన అతడి సోదరి సలీమా తన భర్తను అతి దారుణంగా హతమార్చింది. నయీమ్‌ అనుచరుడు కృష్ణ అలియాస్‌ బాషాతో సలీమా అక్రమ సంబంధం పెట్టుకుందని ఇతర అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు. అక్రమ సంబంధం విషయం తెలియడంతో సలీమా భర్త కొండా విజయ్‌కుమార్‌ అలియాస్‌ నదీం.. ఇంట్లోంచి వెళ్లిపోవడానికి సిద్ధమయ్యాడు. తమ రహస్యాలు బయటపడతాయనే ఉద్దేశంతో నయీమ్, సలీమా, ఇతర కుటుంబ సభ్యులు కలసి అతడిని హతమార్చారు. స్వయంగా సలీమానే భర్తను చున్నీతో బిగించి చంపేసింది.
 
పసికందులను అడ్డం పెట్టుకుని..
తన కామవాంఛలకు బాలికలను, యువతు లను బలిచేసిన నయీమ్‌.. తన దందాల సమయంలో రక్షణగా నెలల వయసున్న పసికందులను ఉపయోగించుకున్నాడు. దందాల సమయంలో, సెటిల్మెంట్లలో వసూలు చేసిన సొమ్మును తరలించే సమయంలో నయీమ్‌ భార్య, అక్క, కోడలు ఆ పిల్లలను వెంట పెట్టుకునేవారు. పసిపిల్లలు, మహిళలు ఉండడంతో పోలీసులు ఆయా వాహనాలను తనిఖీ చేయకుండా వదిలేసేవారని, అలా పట్టుబడకుండా తప్పించుకునేవారని అనుచరులు వెల్లడించారు. తన అత్త సుల్తానా మిర్యాలగూడ, నల్లగొండ సమీప ప్రాంతాల నుంచి పసిబిడ్డలను కొనుగోలు చేసి తీసుకువచ్చేది.

అలా 2010 నుంచి నయీమ్‌ ఎన్‌కౌంటర్‌ సమయం వరకు 30 మందికిపైగా పిల్లలను తీసుకువచ్చారు. అప్పుడే పుట్టిన శిశువుల నుంచి మూడు నెలల వరకు వయసున్న ఈ చిన్నారులకు తానే పేర్లు పెట్టి.. వివిధ ప్రాంతాల్లోని తన నివాసాల్లో పెట్టాడు. ఈ పిల్లలంతా ప్రస్తుతం ఓ రెస్క్యూ హోంలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. వారిని తిరిగి తల్లిదండ్రులకు అప్పగించేందుకు పోలీసులు ప్రయత్నించినా.. కొందరి తల్లిదండ్రులను గుర్తించలేకపోతున్నారని, మరికొందరు పిల్లలను తీసుకెళ్లేందుకు ముందుకురావడం లేదని తెలిసింది.
 
దారుణంగా హతమార్చాడు..
అలకాపురి కాలనీలోని ఇంట్లో 18 ఏళ్ల అనామిక (పేరు మార్చాం)పై 2015 జూలై 24న నయీమ్‌ అత్యాచారానికి పాల్ప డ్డాడు. ఆమె సహకరించలేదనే కోపంతో తీవ్రంగా గాయపరిచాడు. అదే రోజు రాత్రి తుక్కుగూడలో నయీమ్‌ తమ్ముడి కుమార్తె ఎంగేజ్‌మెంట్‌ ఉండడంతో.. అనామికకు నిద్ర మాత్రలు మింగించి, ఓ గదిలో పడేసి అందరూ వెళ్లిపోయారు. మరుసటి రోజు సాయంత్రం తిరిగి వచ్చారు. కదలకుండా పడి ఉన్న అనామికను చూసి చనిపోయిందనుకొన్నారు. బయటకు తరలించే క్రమంలో ఆమెకు ప్రాణం ఉన్నట్లు గుర్తించిన నయీమ్‌... క్రూరంగా ఆమె పొట్టపై తొక్కి, గొంతు నులిమి చంపేశాడు. తర్వాత డ్రైవర్‌తో కలసి ఇంటికి రెండు కిలోమీటర్ల దూరంలోని పొదల్లో మృతదేహాన్ని దహనం చేశారు.
 
2014లో ఇద్దరు బాలికలను తీసుకుని ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లిన నయీమ్‌.. వారిని తిరిగి హైదరాబాద్‌కు తీసుకురాలేదు. వారిని చంపేశాడా? లేకా అక్కడి అనుచరులకు వదిలేశాడా.. అన్నదానిపై పోలీసులు ఇంకా గుర్తించలేకపోయారు.
2016 ఫిబ్రవరిలో గోవాలోని ఇంట్లో ఉన్న యువతి పారిపోయేందుకు ప్రయత్నించడంతో.. నయీమ్‌ అతి దారుణంగా చంపేసినట్టు అనుచరులు పోలీసు విచారణలో వెల్లడించారు.