ఉజ్జయిని హర్రర్‌.. ‘సాయం కోసం 8 కి.మీ నడక.. ఆటోలో రక్తపు మరకలు

28 Sep, 2023 11:35 IST|Sakshi

అత్యాచారానికి గురైన 12 ఏళ్ల బాలిక ఉజ్జయిని రోడ్లపై సాయం కోసం తిరిగిన వీడియో మానవత్వానికి మాయని మచ్చగా నిలిచింది.  సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఈఘటనలో పోలీసులు ముమ్మరంగా విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఓ ఆటో డ్రైవర్‌తోపాటు మరోముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. దీనస్థితిలోని బాలిక సాయం కోసం తిరిగిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. 

సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచి..
ఈ ఫుటీజీలో బాధితురాలు చెప్పులు లేకుండా సాయం కోసం 8 కిలోమీటర్లు నడిచినట్లు తేలింది. అరెస్ట్‌చేసిన ఆటో డ్రైవర్‌ను రాకేష్‌గా గుర్తించారు. బాధితురాలు జీవన్‌ ఖేరీ వద్ద ఈ  ఆటోనే ఎక్కిందని, ఆ సీసీటీవీ వీడియో కూడా లభించినట్లు పోలీసులు తెలిపారు. అంతేగాక ఆటోలు రక్తపు మరకలు కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆటోను ఫోరెన్సిక్‌ పరీక్షల కోసం పంపినట్లు వెల్లడించారు. అయితే అరెస్ట్‌ అయిన మిగతా ముగ్గురు కూడా ఆటో డ్రైవర్లనే తేలింది. 

వీడియో బయటకు రావడంతో..
అణ్యంపుణ్యం తెలియని  పన్నెండేళ్ల బాలిక నీచుల చేతిలో అఘాయిత్యానికి గురై ఉజ్జయిని కి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న బద్‌నగర్ రోడ్డుపై అర్ధనగ్నంగా, రక్తమోడుతూ సాయం కోరుతూ కనిపించిన వీడియో అందరినీ కంట తడి పెట్టించిన విషయం తెలిసిందే. చిన్నారికి వచ్చి కష్టాన్ని చూసిన వారు దిగ్భ్రాంతికి లోనయ్యారే తప్ప సాయం చెయ్యడానికి ముందుకు రాలేని దారుణమైన ఉదంతం మధ్యప్రదేశ్‌లో  వెలుగుచూసింది. సోమవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ బుధవారం బయటకు రావడంతో  ఈ దారుణం గురించి తెలిసింది.
చదవండి: యువతిపై స్పా యజమాని దాడి.. రోడ్డుపై జుట్టు లాగి, దుస్తులు చింపి

సిట్‌ ఏర్పాటు..
బాలికను చూసిన కొందరు పొమ్మంటూ సైగలు  కూడా చేయడం కూడా వీడియో కనిపించింది. చివరికి ఆ బాలిక ఒక ఆశ్రమం ఎదుటకు రాగా రాహుల్‌ శర్మ అనే పూజారి గమనించి ఆమెకు దుస్తులు అందించాడు. బాధితురాలు నిస్సహక స్థితిలో ఉండటంతో వెంటనే ఆసుపత్రికి తరలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ బాలికపై అత్యాచారం జరిగిందని వైద్య పరీక్షల్లో తేలడంతో వెంటనే ప్రభుత్వం సిట్‌ను ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. ప్రస్తుతం ఆ బాలికకు ఇండోర్‌ ఆస్పత్రిలో చికిత్స నిర్వహిస్తున్నామని, ఆమె ప్రాణానికి ప్రమాదం లేదని మధ్యప్రదేశ్‌ హోంమంత్రి నరోత్తమ్‌ మిశ్రా చెప్పారు.

ఆ బాలిక ఉత్తరప్రదేశ్‌ నుంచి వచ్చినట్టుగా పోలీసులు చెబుతున్నారు. అత్యాచారానికి గురి కావడంతో తీవ్రమైన షాక్‌లో ఉన్న ఆ బాలిక తను ఎక్కడ నుంచి వచ్చిందో, తల్లిదండ్రులు ఎవరో ఇంకా చెప్పలేకపోతోందని, ఆమె నుంచి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు చెప్పారు. ఆ బాలికను నిరంతరం వైద్యులు, మానసిక నిపుణులు పరీక్షిస్తున్నారని కౌన్సెలింగ్‌ ఇస్తున్నారని తెలిపారు.

నా దుస్తులు ఇచ్చి, పోలీసులకు కాల్‌ చేశా: పూజారి 
ఉజ్జయిని అత్యాచార బాధితురాలిని రక్షంచిన  పూజారి రాహుల్ శర్మ.. బాలిక ఎదుర్కొన్న భయానక స్థితిని వివరించాడు. సోమవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఏదో పని నిమిత్తం ఆశ్రమం నుంచి బయటకు వస్తుండగా గేట్ల దగ్గర రక్తస్రావంతో అర్ధనగ్నంగా ఉన్న బాలికను గమనించినట్లు తెలిపారు. ఆమెకు తన బట్టలు ఇచ్చినట్లు చెప్పారు. రక్తం కారుతూ, కళ్ళు వాచిపోయాయి కనిపించాయని, ఏం మాట్లాడలేకపోయిందని పేర్కొన్నారు. వెంటనే డయల్‌ 100కి కాల్ చేసినట్లు తెలిపారు. మహంకాల్‌ పోలీసులు 20 నిమిషాల్లో ఆశ్రమానికి చేరుకొని ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 

భయంతో నా వెనక దాక్కుంది
బాలిక తమతో ఏదో చెప్పిందుకు ప్రయత్నిస్తుంటే మాకు అర్థం కాలేదు. ఆమె పేరు, కుటుంబం గురించి ఆరా తీశాము. ఆమె సుక్షితంగా ఉందని, తనను జాగ్రత్తగా ఇంటి వద్దకు చేరుస్తామని భరోసా ఇచ్చాను. కానీ ఆమె చాలా భయపడుతూ కనిపించింది.  బాలిక కేవలం మమ్మల్ని మాత్రమే నమ్మింది. వేరే వాళ్లు ఆమె వద్దకు వచ్చినప్పుడు భయపడి నా వెనుక దాక్కునేందుకు ప్రయత్నించింది. చివరికి పోలీసులు వచ్చి ఆమెను తమతో తీసుకెళ్లారు’ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు