ఔటర్ చుట్టు జలహారం

7 Mar, 2017 03:49 IST|Sakshi
ఔటర్ చుట్టు జలహారం

∙రూ.400 కోట్లతో పనులు..
∙తొమ్మిది నెలల్లో పూర్తి
∙కృష్ణా, గోదావరితో నీటి సరఫరాకు ఏర్పాట్లు
∙నీటి వృథాపై సర్వే.. వాణిజ్య నల్లాలపై నజర్‌
∙జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ దానకిశోర్‌


సిటీబ్యూరో: రాజధానికి మణిహారంలాంటి ఔటర్‌ రింగ్‌రోడ్డు చుట్టూ భారీ మంచినీటి పైప్‌లైన్‌ (రింగ్‌మెయిన్‌)తో గ్రేటర్‌ వాటర్‌ గ్రిడ్‌ ఏర్పాటుకు జలమండలి శ్రీకారం చుడుతోంది. ఇందుకు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పదిరోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలిచి.. 9 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మహా నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం సిటీకి తరలిస్తున్న 116 మిలియన్‌ గ్యాలన్లకు అదనంగా.. మరో 54 మిలియన్‌ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఇందుకోసం 1800 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు.

ఇది అందుబాటులోకి వస్తే సింగూరు, మంజీరా నీటి సరఫరా వ్యవస్థలున్న పటాన్‌చెరు, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్‌ ప్రాంతాల దాహార్తి సమూలంగా తీరుతుంది. ప్రస్తుతం జంట జలాశయాలు, సింగూరు, మం జీరా జలాశయాల నుంచి నీటిసరఫరా లేకున్నా కృష్ణా, గోదావరి నుంచి నిత్యం 372 మిలియన్‌ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించి సరఫరా చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోసోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలమండలి మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎం.దానకిశోర్‌.. ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, సత్య సూర్యనారాయణతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. రుతుపవనాలు కరుణిస్తే ఈ ఏడాది జూలై నుంచి నగరంలో రోజూ నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం 170 బస్తీల్లో 10 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు.

ఔటర్‌ గ్రామాలకు తీరనున్న దాహార్తి..
వచ్చే వేసవి (2018 మే) నాటికి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దానకిశోర్‌ తెలిపారు. రూ.628 కోట్లతో యాన్యుటీ విధానంలో చేపట్టనున్న పనులకు సింగిల్‌ టెండరు దాఖలైంది. దీంతో ఇటీవల ఈ టెండరును రద్దుచేసి తాజాగా టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఇందులో పలు సంస్థలు పాల్గొనేందుకు వీలుగా వడ్డీరేటులో సడలింపు, 70 శాతం పనులు పూర్తయిన తరవాతే కమర్షియల్‌ ఆపరేషన్స్‌ డేట్‌ వర్తింపు వంటి అంశాల్లో వెసులుబాటు కల్పించామన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై సర్పంచ్‌లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించి దాహార్తిని తీర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు.

శరవేగంగా హడ్కో పనులు
శివారు మున్సిపల్‌ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో మొత్తం 2,600 కి.మీ. పైప్‌లైన్‌ వ్యవస్థకు ఇప్పటి వరకు 908 కి.మీ. పైప్‌లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెలలో 20, ఏప్రిల్‌లో 15, మేలో మరో 15, జూన్‌లో 10 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా 10 మంది ఇంజినీర్లతో నాణ్యతా తనిఖీ బృందం ఏర్పాటు చేశామని, బయటి ఏజెన్సీలతో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కృష్ణా ఫేజ్‌–2 పైప్‌లైన్‌ పనులకు 3 కి.మీ. మార్గంలో మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టడం ద్వారా పాతనగరానికి ఈ వేసవిలో 25 మి.గ్యాలన్ల జలాలను అదనంగా సరఫరా చేస్తామన్నారు.

జంటజలాశయాలపై అధ్యయనం..
జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తుందని, ఈ అంశంపై గ్రీన్‌ ట్రిబ్యునల్‌ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. ప్రస్తుతం 43 శాతం ఉన్న నీటి సరఫరా నష్టాలను తగ్గించేందుకు నారాయణగూడ, ఎస్‌.ఆర్‌.నగర్, మారేడ్‌పల్లి డివిజన్లలో ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సర్వే చేస్తామని తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో ఈసర్వే పూర్తవుతుందన్నారు. రెవెన్యూ నష్టాలను తగ్గించే దిశగా ఇటీవల రూ.46 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామన్నారు. వాణిజ్య నల్లాల గుర్తింపునకు 360 డిగ్రీ సర్వేకు ఉన్నతాధికారులను రంగంలోకి దించామన్నారు. గృహ వినియోగ కేటగిరీ కింద ఉన్న 5,942వాణిజ్య భవంతులను గుర్తించామన్నారు. దెబ్బతిన్న పైప్‌లైన్లను గుర్తించేందుకు గ్రౌండ్‌ పెనిట్రేటషన్‌ రాడార్‌ సాంకేతికత, ఎన్‌జీఆర్‌ఐ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. నెక్లెస్‌రోడ్‌లో దెబ్బతిన్న భారీ సీవరేజీ పైప్‌లైన్‌ను క్యూర్డ్‌ ఇన్‌ప్లేస్‌పైప్‌ సాంకేతికతతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు