పార్టీ చేసుకొని.. పన్ను కట్టరా?

3 Jan, 2018 04:03 IST|Sakshi

 న్యూ ఇయర్‌ ఈవెంట్ల పన్ను రాబట్టేందుకు రంగంలోకి పన్నుల శాఖ  

 40 ప్రత్యేక బృందాలతో జల్లెడ.. 40 సంస్థలకు నోటీసులు  

 జాబితాలో ఆర్‌ఎఫ్‌సీ, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్, కంట్రీ క్లబ్‌లు  

 ఆదాయం రూ. కోట్లలోనే ఉంటుందంటున్న అధికారులు

సాక్షి, హైదరాబాద్‌: న్యూ ఇయర్‌ ఈవెంట్లకు కచ్చితంగా పన్ను కట్టాలని ముందే హెచ్చరించినా అనేక మంది ఈవెంట్‌ నిర్వాహకులు స్పందించకపోవడంతో పన్నుల శాఖ రంగంలోకి దిగింది. 40 ప్రత్యేక బృందాలతో నగరమంతా గాలించిన అధికారులు.. డిసెంబర్‌ 30, 31 తేదీలలో నగరంలో జరిగిన ఈవెంట్ల వివరాలు సేకరించి కార్యక్రమాలు జరిగిన ప్రదేశాల యజమానులు, ఈవెంట్ల నిర్వాహకులకు నోటీసులిచ్చారు. మొత్తంగా 40 సంస్థలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.  

పట్టించుకోకపోవడంతో.. 
న్యూ ఇయర్‌ ఈవెంట్లన్నీ పన్ను పరిధిలోకొస్తాయని.. టీజీఎస్టీ, సీజీఎస్టీ చట్టాల్లోని సెక్షన్‌ 25 (1) ప్రకారం ఈవెంట్ల నిర్వాహకులు రిజిస్టర్‌ చేసుకుని పన్ను కట్టాలని పన్నుల శాఖ కమిషనర్‌ అనిల్‌కుమార్‌ గత నెల 28నే ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ప్రకారం పన్నుల శాఖ కార్యాలయంలో ఈవెంట్లను రిజిస్టర్‌ చేయించుకొని ముందస్తు పన్ను చెల్లించాలి. కానీ, ఉత్తర్వులను అనేకమంది పట్టించుకోకపోవడంతో 40 ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. పన్నుల శాఖ ఉన్నతాధికారులతో కూడిన ఈ బృందాలు 30, 31 తేదీల్లో ఈవెంట్లు జరిగిన ప్రదేశాలకు వెళ్లి నిర్వాహకులకు నోటీసులిచ్చారు. ఈవెంట్లకు సంబంధించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ టికెట్ల అమ్మకాలు, అగ్రిమెంట్‌ కాపీల వివరాలు సేకరించారు. లభించిన సమాచారం ప్రకారం నిర్వాహకులతోపాటు ఈవెంట్‌ జరిగిన ప్రదేశాల బాధ్యులకూ నోటీసులిచ్చారు.  

రామోజీ ఫిలింసిటీ, ఫలక్‌నుమా ప్యాలెస్‌.. 
నగరమంతా గాలించిన బృందాలు 40 సంస్థలకు నోటీసులిచ్చాయి. జాబితాలో ప్రముఖ క్లబ్‌లు, హోటళ్లు ఉన్నాయి. రామోజీ ఫిలింసిటీ, జూబ్లీహిల్స్‌ ఇంటర్నేషనల్‌ క్లబ్, ఫిలింనగర్‌ కల్చరల్‌ క్లబ్, కంట్రీక్లబ్, ఫలక్‌నుమా ప్యాలెస్‌ లాంటి ప్రముఖ పర్యాటక ప్రదేశాలకూ నోటీసులిచ్చామని శాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు. నగరంలో జరిగిన న్యూ ఇయర్‌ ఈవెంట్ల పన్ను రూ.కోట్లల్లో వస్తుందని, చట్టం ప్రకారం నోటీసులిచ్చామని అధికారులు చెబుతున్నారు.  

అగ్రస్థానం సన్‌బర్న్‌దే.. 
హైదరాబాద్‌లో డిసెంబర్‌ 31న జరిగిన గ్రాండ్‌ పార్టీల్లో గచ్చిబౌలి సన్‌బర్న్‌దే అగ్రస్థానమని పన్నుల శాఖ పరిశీలనలో తేలింది. నగరంలోని ప్రముఖ క్లబ్‌లు, హోటళ్లలో వందల సంఖ్యలో ఈవెంట్లు జరిగినా సన్‌బర్న్‌ ఈవెంట్‌లో 90 శాతానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయని పన్నుల శాఖ వర్గాలు చెబుతున్నాయి. చట్ట ప్రకారం ఈవెంట్‌ నిర్వాహకులు పన్ను చెల్లించాల్సిందేనని.. సన్‌బర్న్‌ నిర్వాహకుడు రిజిస్టర్డ్‌ డీలర్‌ కావడంతో చెల్లింపులో ఇబ్బంది తలెత్తే అవకాశం లేదంటున్నారు.   

మరిన్ని వార్తలు