హత్యలన్నీ టీడీపీవే అంటే ఎలా?

19 Aug, 2014 03:12 IST|Sakshi
హత్యలన్నీ టీడీపీవే అంటే ఎలా?

వైఎస్సార్ కాంగ్రెస్‌పై టీడీపీ నేతల ధ్వజం
శాంతిభద్రతలపై అసెంబ్లీలో ప్రతిపక్షం చర్చకోరడం అర్థరహితం

 
సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను హత్యలు చేయిస్తోందని ప్రతిపక్షం ఆరోపించడంలో అర్థం లేదని.. సాధారణ హత్య కేసులను టీడీపీ ఖాతాలో వేసి సానుభూతి పొందేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని రాష్ట్ర కార్మికమంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించారు.

ఆయన సోమవారం శాసనసభ మీడియా పాయింట్‌లో విలేకరులతో మాట్లాడుతూ అనేక ప్రజా సమస్యలున్నాయని.. ప్రధాన ప్రతిపక్షం గా వాటిపై చ ర్చించడం మాని, శాంతిభద్రతల పై చర్చించాలని వైఎస్సార్ కాంగ్రెస్ వాయిదా తీర్మానం కోరడం అర్థరహితమని విమర్శించా రు. పదమూడు జిల్లాల్లో టీడీపీ ఎవరిని చంపిం చిందో, ఎక్కడ చనిపోయారో వారి పేర్లు ఇవ్వాలని పేర్కొన్నారు.
 
పరిటాల రవి కేసులో ప్రధాన ముద్దాయిగా జగన్‌మోహన్‌రెడ్డి ఉన్నారని, వై.ఎస్.రాజశేఖరరెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయనను తప్పించారని ఆరోపించారు. వైఎస్ అధికారంలోకి వచ్చాక 226 మందిని రాజకీయంగా చంపిస్తే అందులో తమ పార్టీ వారు 120 మంది ఉన్నారన్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విభజన తరువాత కీలకంగా జరిగే బడ్జెట్ సమావేశాలకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని.. ఇలాంటి స్థితిలో సమస్యలపై పోరుబాట పట్టకుండా.. ఫ్యాక్షన్ రాజకీయాలకు జగన్ ఆజ్యం పోసి సభా సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. అందర్నీ సమంగా చూస్తుంటే శాంతిభద్రతలు అడుగంటాయని ప్రతిపక్షం బురద చల్లుతోందని ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. స్థానిక గొడవల్లో మరణించిన వారివి  హత్యలయిపోతాయా? అని ఎమ్మెల్యే బోండా మహేశ్వరరావు ప్రశ్నించారు.

మరిన్ని వార్తలు