జాబ్ సెర్చ్‌కు టెక్నాలజీని వాడుకోండి !

28 Aug, 2014 00:42 IST|Sakshi
జాబ్ సెర్చ్‌కు టెక్నాలజీని వాడుకోండి !

మీ అర్హతలు, నైపుణ్యాలకు తగిన మంచి ఉద్యోగం కోసం చూస్తున్నారా? అయితే, అది ఎక్కడ లభిస్తుంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? వంటి విషయాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఆధునిక టెక్నాలజీ అన్ని రంగాలను ప్రభావితం చేస్తోంది. జాబ్ సెర్చ్ కూడా ఇందుకు మినహాయింపు కాదు. పోటీ ప్రపంచంలో ఇతరులను దాటి ముందుకెళ్లాలంటే అభ్యర్థులు ఈ పరిజ్ఞానాన్ని తప్పనిసరిగా వాడుకోవాలి.
 
జాబ్ పోర్టల్స్: ఒక్క క్లిక్‌తో అంతర్జాలంలో కొలువుల వివరాలు తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఎన్నో జాబ్ పోర్టళ్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలోకి ప్రవేశించి, అర్హతలకు తగిన ఉద్యోగాలను, రంగాలను వెతుక్కోవచ్చు. సంస్థలు ప్రకటించిన ఖాళీల సమాచారం, దరఖాస్తు ప్రక్రియ గురించి జాబ్ పోర్టళ్లలో ఉంటుంది. కంపెనీల వివరాలు, కెరీర్ సలహాలు కూడా ఇందులో లభిస్తాయి. కాబట్టి ఉద్యోగాల వేటలో మునిగిన అభ్యర్థులు ఇలాంటి పోర్టళ్లను ఉపయోగించుకుంటే శ్రమ తగ్గుతుంది. అనుకున్న లక్ష్యం త్వరగా నెరవేరుతుంది.  
 
ఈ-రెజ్యుమె: పేపర్ రెజ్యుమెలు క్రమంగా కనుమరుగవుతున్నాయి. ఇకపై ఎలక్ట్రా నిక్-రెజ్యుమె(ఈ-రెజ్యుమె)లతోనే పని పూర్తవుతుంది. కంపెనీలు అభ్యర్థుల నుంచి ఇలాంటి రెజ్యుమెలనే స్వీకరిస్తాయి. కాబట్టి ప్రభావవంతమైన ఈ-రెజ్యుమెను రూపొందించు కోవాలి. ఇంటర్నెట్‌లో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఈ విషయంలో సలహాలు, సూచనలు కూడా లభిస్తాయి. వాటిని పరిశీలించాలి. సొంతంగా ఈ-రెజ్యుమెను రూపొందించుకున్న తర్వాత దాన్ని జాబ్ పోర్టళ్లకు, వెబ్‌సైట్లకు ఈ-మెయిల్ ద్వారా పంపించాలి. మీ అర్హతలను తగిన ఉద్యోగాలంటే.. కంపెనీలు మిమ్మల్ని సంప్రదిస్తాయి. రిక్రూటర్ నుంచి మీకు పిలుపు వస్తుంది.
 
వీడియో రెజ్యుమె: దరఖాస్తుల విషయంలో తెరపైకొచ్చిన మరో ఆధునిక ధోరణి.. వీడియో రెజ్యుమె. అభ్యర్థులు తమ అర్హతలు, అనుభవం, ఇతర వివరాలను స్వయంగా చెబుతూ ప్రభావవంతమైన వీడియోను చిత్రీకరించుకోవాల్సి ఉంటుంది. దీని వ్యవధి సాధారణంగా రెండు నుంచి మూడు నిమిషాల్లోపే ఉండడం మంచిది. కొలువు ప్రకటనను చూసిన తర్వాత ఈ వీడియో రెజ్యుమెను రిక్రూటర్‌కు పంపించాలి. ఇటీవలి కాలంలో సంస్థలు ఇలాంటి రెజ్యుమెలకే ప్రాధాన్యత ఇస్తున్నాయి.
 
సీడీలో రెజ్యుమె: కాంపాక్ట్ డిస్క్(సీడీ)లో రెజ్యుమెను భద్రపర్చుకోవాలి. అవసరాన్ని బట్టి దాన్ని రిక్రూటర్‌కు పంపించాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు రెజ్యుమెను సీడీలో పంపించాలని కోరుతుంటాయి. కాబట్టి ముందుగానే ఇలాంటి సీడీని రూపొందించుకోవడం మేలు.
 
సొంత వెబ్‌సైట్:
ఆధునిక కాలంలో అన్ని సంస్థలకు వెబ్‌సైట్‌లు సర్వసాధారణంగా మారాయి. అభ్యర్థులు కూడా తమ పేరిట సొంత వెబ్‌సైట్‌ను ప్రారంభించుకోవాలి. ఇందుకోసం వెబ్‌సైట్ డెవలప్‌మెంట్‌లో కొంత శిక్షణ పొందాలి. ఇందులో మీకు సంబంధించిన సమస్త సమాచారం పొందుపర్చాలి. కొలువు వేటలో ఉన్నవారికి ఇలాంటి సొంత వెబ్‌సైట్ ఉపయోగపడుతుంది. సంస్థలు అభ్యర్థి వెబ్‌సైట్‌ను పరిశీలించి, ఇంటర్వ్యూకు పిలిచేందుకు అవకాశాలుంటాయి.
 
సామాజిక మాధ్యమాలు: ఫేస్‌బుక్, ట్విట్టర్, లింక్డ్‌ఇన్ వంటి సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులకు తప్పనిసరిగా ఖాతా ఉండాలి. వాటిలో తమ పూర్తి ప్రొఫైల్‌ను పొందుపర్చాలి. రిక్రూటర్లు వీటిని చూసి, తమకు తగిన అభ్యర్థులను ఎంచుకుంటారు.
 
 
 

మరిన్ని వార్తలు