‘డబుల్’కు తప్పని ట్రబుల్

25 Mar, 2016 00:52 IST|Sakshi
‘డబుల్’కు తప్పని ట్రబుల్

డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ఖర్చు తగ్గించే పరిజ్ఞానంపై ఆరా
ఆసక్తివ్యక్తీకరణ ప్రకటన జారీ చేసిన ప్రభుత్వం
డిజైన్లు సమర్పించేందుకు నెలాఖరు వరకు గడువు
ఖర్చుకు జడిసి ముందుకురాని కాంట్రాక్టర్లు
మూడు చోట్ల మినహా ఎక్కడా ఖరారు కాని టెండర్లు

 

హైదరాబాద్: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు ట్రబుల్ తప్పడంలేదు. ప్రతిపాదిత యూనిట్‌కాస్ట్ తమకు గిట్టుబాటు కాదంటూ కాంట్రాక్టర్లు మొహంచాటేస్తున్నారు. ఇసుక ఉచితంగా ఇచ్చినా, సిమెంటు, స్టీలు లాంటి మెటీరియల్‌ను తక్కువధరకు సరఫరా చేసినా నిర్మాణం వ్యయం యూనిట్ కాస్ట్‌ను మించి అవుతుందని కాంట్రాక్టర్లు అంటున్నారు. తాను ప్రతిపాదించిన యూనిట్‌కాస్ట్‌లో ఇళ్లను నిర్మించదగ్గ పరిజ్ఞానం ఎక్కడుందో తెలుసుకునేందుకు ప్రభుత్వం వేట ప్రారంభించింది. ఇందుకోసం ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు పరిజ్ఞానం, దాని ద్వారా నిర్మిస్తే అయ్యే వ్యయం, డిజైన్లు తయారు చేసుకుని రావాల్సిందిగా ప్రభుత్వం తాజాగా ఆసక్తివ్యక్తీకరణ ప్రకటన జారీ చేసింది. ఈ నెలాఖరు వరకు వారు డిజైన్లు సమర్పించేందుకు గడువు విధించింది.


మూడుచోట్లనే టెండర్లు
రెండు పడక గదుల ఇళ్ల కోసం ప్రభుత్వం పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు విడి విడిగా అంచ నా వ్యయం ఖరారు చేసింది. పట్టణ ప్రాంతా ల్లో రూ.5.30 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.5.04 లక్షలుగా నిర్ధారించింది. పట్టాణాల్లో ఇళ్లను ఒకేచోట కాలనీలుగా నిర్మించనుండగా, గ్రామీణ ప్రాంతాల్లో అది కుదరటం లేదు. ఫలితంగా ప్రభుత్వం నిర్ధారించిన అంచనా వ్యయంలో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని కాంట్రాక్టర్లు తేల్చేశారు. ప్రభుత్వం ఏర్పడి 21 నెలలు కావస్తున్నా, ఒక్క ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలోని ఎర్రవల్లి గ్రామం మినహా మరే గ్రామీణ ప్రాంతంలోనూ ఇళ్లను నిర్మించలేదు. కేవలం వరంగల్, మహబూబ్‌నగర్, నిజామాబాద్ పట్టణాల్లో మాత్రమే టెండర్లు ఖరారయ్యాయి. అవి కూడా జీప్లస్ 3 పద్ధతిలో నిర్మించేవాటికే ఆర్డరయ్యాయి. జీ ప్లస్ 1 పద్ధతిలో నిర్మించే ఇళ్లకు టెండర్లు పిలిస్తే చాలా ఎక్కువ మొత్తానికి కోట్ చేయటంతో ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. విపక్షాలు, ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ తరుణంలో ఇంకా మీనమేషాలు లెక్కించటం మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందుతున్న ప్రభుత్వం తక్కువఖర్చుతో తాను ప్రతిపాదించిన యూనిట్‌కాస్ట్‌తో ఇళ్లను నిర్మించే సంస్థ కోసం ప్రకటన జారీ చేసింది.

 

కార్పొరేట్ సామాజిక బాధ్యతపై చూపు
కార్పొరేట్ కంపెనీలు ‘సామాజిక బాధ్యత’గా కొంత ఉదారతను ప్రదర్శిస్తుంటాయి. ఆ ఉదారతను ఇప్పుడు రెండు పడక గదుల ఇళ్ల విషయంలో చూపాలని ప్రభుత్వం కోరుతోంది. ఈ పథకం రూపంలో ప్రభుత్వ ఖజానాపై అత్యంత భారీ భారం పడుతోంది. దాన్ని భరించటం ప్రభుత్వానికి కష్టంగా మారబోతోంది. దీంతో బడా పారిశ్రామికవేత్తలు సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని కోరబోతోంది. సిమెంటు, స్టీలు, ఇతర నిర్మాణ సామగ్రి తయారీ సంస్థలు అతి తక్కువ ధరకు మెటీరియల్‌ను అందించేలా కోరాలని కూడా నిర్ణయించినట్టు తెలిసింది.

 

whatsapp channel

మరిన్ని వార్తలు