పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ?

15 Mar, 2016 04:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖకు జరిగిన కేటాయింపులను గత ఏడాదితో పోలిస్తే 2016-17 ఆర్థిక బడ్జెట్‌లో రూ.6.64 కోట్ల మేర కోతలు విధిస్తూ  ఆర్థిక మంత్రి ప్రతిపాదనలు సమర్పించారు. గత ఏడాది పరిశ్రమల శాఖకు రూ.973.73 కోట్లను ప్రణాళిక, ప్రణాళికేతర పద్దుల క్రింద ప్రతిపాదించగా.. ఈ ఏడాది రూ.967.09 కోట్లకు పరిమితం చేశారు. ఇందులో రూ.859.63 కోట్లను ప్రణాళికా వ్యయం కింద ప్రతిపాదించారు. గతేడాది ప్రతిపాదించిన బడ్జెట్‌లో ఇప్పటి వరకు రూ.689.26 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్లు సవరణ ప్రతిపాదించారు.

ప్రస్తుత బడ్జెట్‌లో పరిశ్రమల విభాగానికి మినహా.. ఇతర అనుబంధ శాఖల కోటాలో భారీగా కోత విధించారు. విదేశీ వాణిజ్యం, ఎగుమతులు, చక్కెర పరిశ్రమ శాఖ కు నయాపైసా విదల్చలేదు. చక్కెర శాఖను వ్యవసాయ శాఖలో.. విదేశీ వాణిజ్య విభాగాన్ని టీఎస్‌ఐఐసీలో విలీనం చేస్తారనే వార్తల నేపథ్యంలో నయాపైసా కేటాయించక పోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిజాం దక్కన్ షుగర్స్ పునరుద్ధరణకు ప్రభుత్వం చొరవ చూపుతుందని ఆశించినా.. బడ్జెట్‌లో ప్రస్తావనకు రాలేదు. ఆహార నిల్వ, గిడ్డంగులకు గత ఏడాది రూ.101.56 కోట్లు ప్రతిపాదించి, రూ.60.26 కోట్లు ఖర్చు చేయగా.. ఈ ఏడాది ప్రతిపాదన ల్లో కేవలం రూ.10 కోట్లకు పరిమి తం చేశారు.

చేనేత, జౌళి శాఖకు సంబంధించి కేటాయింపుల్లోనూ భారీగా కోతలు విధించారు. గనులు, భూగర్భ వనరుల శాఖకు గత ఏడాది మాదిరిగానే ప్రణాళికా వ్యయం కింద రూ.కోటి కేటాయించారు.  గ్రామీణ పరిశ్రమలు, ఇతర పరిశ్రమలకు గతంలో రూ.562.88 కోట్లు ప్రతిపాదించగా.. ప్రస్తుత బడ్జెట్‌లో రూ.778.63 కోట్లు ప్రతిపాదించారు.

మరిన్ని వార్తలు