బీజేపీ పరిస్థితిపై అధిష్టానం దృష్టి

19 Oct, 2016 03:02 IST|Sakshi

నేటి నుంచి 3 రోజులపాటు రాష్ట్రంలో జాతీయ నేత పర్యటన

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై బీజేపీ అధినాయకత్వం దృష్టి సారించింది. సంస్థాగతంగా పార్టీ పరిస్థితిని అంచనా వేసేందుకు చర్యలు ప్రారంభించింది. జాతీయ నాయకత్వం ఇచ్చిన కార్యక్రమాల నిర్వహణ కిందిస్థాయిలో పార్టీ యంత్రాంగం తీరు, ఇబ్బందులు, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా పార్టీ రాష్ట్ర శాఖల పనితీరు ఎలా ఉందన్న దానిపై పరిశీలనలో భాగంగా మూడురోజుల పర్యటనపై జాతీయ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ ఇక్కడకు వస్తున్నారు.

ఈ సందర్భంగా వివిధ స్థాయిల్లోని నాయకులు, కార్యకర్తలను కలుసుకుని పార్టీ స్థితి, జిల్లా, మండల, బూత్‌స్థాయిల్లో చేపడుతున్న కార్యక్రమాలను పరిశీలిస్తారు. బుధ, గురువారాల్లో పార్టీ రాష్ర్ట పదాధికారులు, నగరశాఖ కార్యవర్గం, వివిధ జిల్లా కమిటీలతో... శుక్రవారం రాష్ట్ర కోర్ కమిటీతో భేటీ అవుతారు. జాతీయ పార్టీ దిశానిర్దేశం మేరకు పార్టీ విభాగాలు సరిగా పనిచేస్తున్నాయా లేదా దానిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఏమి చేయాలనే దానిపై దృష్టి సారిస్తారు. ఈ పర్యటన ముగిశాక ఆయా అంశాలపై జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు ఆయన ఒక నివేదికను సమర్పిస్తారు.

మరిన్ని వార్తలు