అధికారుల ఉదాసీన వైఖరిపై హైకోర్టు అసంతృప్తి

4 Jun, 2017 02:09 IST|Sakshi
అధికారుల ఉదాసీన వైఖరిపై హైకోర్టు అసంతృప్తి
- తమ ఆదేశాలను అమలు చేయకపోవడంపై మండిపాటు
- 17న చెరువులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని తమ రిజిస్ట్రార్‌కు ఆదేశం
 
సాక్షి, హైదరాబాద్‌: చెరువుల దురాక్రమణలు, వాటి సరిహద్దుల ఖరారు విషయంలో అధికారుల ఉదాసీన వైఖరిపై ఉమ్మడి హైకోర్టు తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. మేడ్చల్‌ జిల్లా, కాప్రా పరిధిలోని ఊర చెరువు (కాప్రా చెరువు) యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోకపోవడంపై మండిపడింది. ఆక్రమణలను తొలగించాలని తాము ఆదేశాలు జారీ చేసినా అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారులు తమ ఆదేశాలను అమలు చేయకపోవడంతో హైకోర్టు తమ రిజిస్ట్రార్‌నే రంగంలోకి దింపింది. ఆక్రమణదారులతో అధికారులు కుమ్మక్కయ్యారన్న పిటిషనర్‌ ఆరోపణల నేపథ్యంలో, చెరువు ఆక్రమణలను గుర్తించి, దాని పూర్తిస్థాయి నీటి మట్టం  నిర్ధారించే బాధ్యతలను హైకోర్టు రిజిస్ట్రార్‌ (జ్యుడీషియల్‌)కు అప్పగించింది.

ఊర చెరువు బఫర్‌ జోన్‌లో జరిగిన నిర్మాణాల వివరాలను తమ ముందుంచాలంది. ఈ నెల 17న స్వయంగా ఊర చెరువును సందర్శించి నివేదిక ఇవ్వాలని రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
మరిన్ని వార్తలు