అమ్మో..ఆడ దొంగలు!

4 Sep, 2017 02:38 IST|Sakshi
అమ్మో..ఆడ దొంగలు!

నగరంలో పెరుగుతున్న మహిళా నేరస్తుల సంఖ్య
మూడేళ్లలో రెండింతలు.. 80 శాతం కొత్త దొంగలే
పేదరికం, రోజువారీ అవసరాలు, విలాసాల కోసమే..
తేలిగ్గా చేయగలిగే చోరీలకే ఎక్కువ ప్రాధాన్యత


సాక్షి, హైదరాబాద్‌: రోజువారీ అవసరాల కోసం కొందరు.. పేదరికంతో మరికొందరు.. విలాసాల కోసం ఇంకొందరు.. మొత్తంగా హైదరాబాద్‌ మహానగరంలో మహిళలు చేసే నేరాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. నగర కమిషనరేట్‌ పరిధిలో నమోదైన గణాంకాలను పరిశీలిస్తే మహిళా నేరస్తులు, కొత్తగా ఈ ‘వృత్తి’లోకి వస్తున్న వారి సంఖ్య ఏటేటా పెరుగుతోందని స్పష్టమవుతోంది. దీనికి పేదరికం, అవసరాలు ప్రధాన కారణాలైతే.. జల్సాలు మరో కారణంగా కనిపిస్తోంది. అయితే మహిళలు తీవ్రమైన నేరాలుగా పరిగణించే హత్యలు, హత్యాయత్నాలకు పాల్పడటం చాలా తక్కువేనని నగర పోలీసులు గుర్తించారు. వీరు ఎక్కువగా తేలిగ్గా చేయగలిగే దొంగతనాలు, మోసాలకే పాల్పడుతున్నట్లు నిర్థారించారు.

తేలికగా చేసే నేరాలపైనే మోజు..
మహిళలు పాల్పడుతున్న నేరాల్లో అత్యధికం ‘ఈజీ క్రైమ్‌’లే ఉంటున్నాయి. సర్వెంట్‌ థెఫ్ట్‌లు, దుకాణాల్లో నగలు, చీరలు కాజేయడంతో పాటు హ్యాండ్‌ బ్యాగ్స్, చెయిన్‌ స్నాచింగ్స్‌కు ఎక్కువగా పాల్పడుతున్నారు. ఇళ్లల్లో పనుల కోసం ఇతర ప్రాంతాలు, జిల్లాలకు చెందిన వారు నగరానికి వస్తున్నారు. వారిలో కొందరు అప్పటికే నేరప్రవృత్తి కలిగి ఉండటం లేదా ఆ ఇంట్లో ఉండే సొమ్ము, సొత్తుకు ఆకర్షితులై యజమానుల నిర్లక్ష్యాన్ని క్యాష్‌ చేసుకుని ఉడాయిస్తున్నారు. ఇలాంటి కేసులు తరచుగా నమోదవుతున్నాయి. మహిళలు చేస్తున్న తీవ్రమైన నేరాల్లో అనేకం కుటుంబీకుల హత్యలకు సంబంధించినవే. వీటికి ప్రధానంగా వివాహేతర సంబంధాలే కారణంగా మారుతున్నాయి. ఈ కేసుల్లో భర్త, పిల్లలే హతులుగా ఉండటం ఆందోళనకర అంశం.

‘వలపు దోపిడీ’లు సైతం..
తమ అందచందాలను ఎరగా వేసి, కాపుకాచి వాహనచోదకుల్ని దోచుకునే కొందరు యువతులు అప్పుడప్పుడు పోలీసులకు చిక్కుతున్నారు. అమీర్‌పేటకు చెందిన నదియా ఉదంతమే దీనికి ఉదాహరణ. విలాసాలకు అలవాటుపడిన ఈ యువతి ‘వలపు దోపిడీలు’ప్రారంభించింది. రోడ్లపై నిల్చుని వాహనచోదకుల్ని లిఫ్ట్‌ అడుగుతుంది. ఎవరైనా ఆపి ఎక్కించుకుంటే కొద్దిదూరం వెళ్లాక వారి పర్సు మాయం చేసి దిగిపోవడమో, రద్దీగా ఉన్న చోట ఆపమని తనను బలవంతంగా తీసుకుపోతున్నారని యాగీ చేయడమో చేసేది. ఎట్టకేలకు పోలీసులకు చిక్కింది.

‘మచ్చు’కు కొన్ని...
వారాసిగూడలో నివసించే మంగాయమ్మ జల్సాల కోసం సొంత కుమారుడి(16)నే దొంగతనాలబాట పట్టించింది. చివరకు కుమారుడితోపాటు కటకటాల్లోకి చేరింది.

కర్మన్‌ఘాట్‌కు చెందిన సమీర్, అతడి భార్య జహారాబేగం, ఓల్డ్‌ మలక్‌పేటకు చెందిన రమ ముఠాగా ఏర్పడి.. రాత్రి వేళల్లో వాహనాలపై వెళ్లే వారిని లిఫ్ట్‌ అడిగి దోపిడీలకు పాల్పడుతూ చిక్కారు.

ఎర్రగడ్డ జనప్రియ మెట్రో పోలిస్‌ అపార్ట్‌మెంట్‌లో నివసించే చంద్రశేఖర్‌ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లో పనిచేసే హసీనా మరో ఇద్దరితో కలసి నేరానికి పాల్పడినట్టు తేలింది.

పక్కింటి వారితో పరిచయం పెంచుకుని, తరచు వారింటికి వెళ్తూ మాటల్లో పెట్టి బంగారం తస్కరించిన కేసులో యూసుఫ్‌గూడ కార్మికనగర్‌కు చెందిన మైమున్నా అరెస్టు అయ్యింది.

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే కారణంగా ప్రియుడితో కలసి భర్తను దారుణంగా హత్య చేసింది షాహిన్‌బేగం.


యాంటీ సోషల్‌ పర్సనాలిటీ వల్లే..
నేరాలు చేయడానికి ఓ మనిషిలో ఉండే యాంటీ సోషల్‌ పర్సనాలిటీ డిజార్డర్స్‌ కారణం. పర్సనాలిటీ అంటే ఆలోచన పద్ధతి, తత్వం, ప్రవర్తన. ఏ పర్సనాలిటీ ఇతరులకు, తనకు సైతం ఇబ్బంది చేసేదిగా ఉంటుందో అది పర్సనాలిటీ డిజార్డర్‌ అవుతుంది. ఇది ఎన్నో రకాలుగా ఉంటుంది. ఈ పర్సనాలిటీ కలిగిన వారు గతంలో చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోరు. ఇటీవల కాలంలో పాపులేషన్, కాంపిటీషన్‌ పెరగడంతో మరింత డెస్పరేషన్‌ వచ్చి వయోలెంట్‌గా మారి నేరాల్లోకి దిగుతున్నారు. సాధారణంగా క్రైమ్‌ టెండెన్సీ అనేది మగవారిలో ఎక్కువగా ఉంటుంది. దీనికి హార్మోన్స్, క్రోమోజోమ్స్‌ ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయి. ప్రస్తుతంస్త్రీలూ పురుషుల స్థాయిలో రియాక్ట్‌ అయి నేరబాట పడుతున్నారు.     
– రాజేష్, కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌

మరిన్ని వార్తలు