హోంవర్క్ చేయలేదని చితకబాదాడు...

25 Feb, 2016 00:18 IST|Sakshi
హోంవర్క్ చేయలేదని చితకబాదాడు...

మీర్‌పేట: హోంవర్క్ చేయాలేదని విద్యార్థిని ఉపాధ్యాయుడు వాతలు తేలేలా చితకబాదాడు.  మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని నాగార్జున మాంటిస్సోరి ఉన్నత పాఠశాలలో బుధవారం ఈ ఘటన జరిగింది. వివరాలు... నాగార్జున పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న సాత్విక్ తెలుగు సబ్జెక్టు హోంవర్క్ చేయకుండా పాఠశాలకు వెళ్లాడు.  దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ  తెలుగు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ అతడిని వాతలు తేలేలా కొట్టాడు.

50 శాతం ఫీజు మాఫీ?
సాత్విక్‌ను గొడ్డును బాదినట్టు బాదిన ఉపాధ్యాయుడితో పాటు పాఠశాలపైన ఫిర్యాదు చేసేందుకు తల్లిదండ్రులు మీర్‌పేట ఠాణాకు వెళ్లారు. విషయం తెలిసి పాఠశాల యాజమాన్యం వెంటనే రంగ ప్రవేశం చేసింది. బాధిత విద్యార్థి పాఠశాలకు చెల్లించాల్సిన ఫీజులో 50 శాతం మాఫీ చేస్తామని, కేసు పెట్టవద్దని వేడుకుంది. అంతేకాకుండా ఈ మేరకు హామీ పత్రం కూడా రాసి ఇవ్వడంతో విద్యార్థి తల్లిదండ్రులు కేసు ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్టు తెలిసింది.
 
కేసు నమోదు కాలేదు: సీఐ
విద్యార్థిని ఉపాధ్యాయుడు దండించినట్టు తల్లిదండ్రులు తమ దృష్టికి తీసుకొచ్చారని, అయితే.. రాత పూర్వకంగా ఫిర్యాదు చేయకపోవడంతో కేసు నమోదు చేయలేదని  మీర్‌పేట సీఐ వెంకట్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
 
టీచర్‌ను అరెస్ట్ చేయాలి

సిటీబ్యూరో: నాగార్జున మాంటిస్సోరి స్కూల్‌లో విద్యార్థిని చితకబాదిన టీచర్‌ను అరెస్ట్ చేయాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. పాఠశాలల్లో రోజురోజుకూ చిన్నారులకు రక్షణ కరువవుతోందని ఆ సంఘం అధ్యక్షురాలు అనురాధారావు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల పట్ల కర్కశంగా ప్రవర్తించే స్కూళ్ల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
 
 
 

మరిన్ని వార్తలు