మేం రెడీ

22 Nov, 2023 05:30 IST|Sakshi

జిల్లాలో పోలింగ్‌ ఏర్పాట్లు ముమ్మరం చేశాం. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా అవసరమైనన్ని బ్యాలెట్‌ యూనిట్లు వచ్చాయి. తొలుత 7,907 అందుబాటులో ఉండేవి. అభ్యర్థుల సంఖ్యకనుగుణంగా రిజర్వులో ఉంచాల్సిన వాటితో సహా మొత్తం 9,346 బ్యాలెట్‌ యూనిట్లు అవసరమని గుర్తించాం. ఆ మేరకు 1,439 యూనిట్లు తక్కువగా ఉండటంతో ఎన్నికల సంఘానికి నివేదించాం. అవి కూడా వచ్చాయి. పోలింగ్‌ సిబ్బందికి అవసరమైన శిక్షణలు పూర్తయ్యాయి. పోలింగ్‌ కేంద్రాలు పెరిగిన నేపథ్యంలో అవసరమైన అదనపు సిబ్బందికి మూడో దఫా ట్రైనింగ్‌ కూడా పూర్తి కానుంది.

ఈ నెల 23 వరకు ఓటరు స్లిప్‌ల పంపిణీ

ఇళ్ల వద్దే పోలింగ్‌ నిర్వహణకు 27 టీంలు

‘సాక్షి’తో రోనాల్డ్‌రాస్‌

ఇళ్ల వద్ద పోలింగ్‌ మొదలైందా ?

వయస్సు 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, వికలాంగులకు ఇంటివద్దనే పోలింగ్‌ అవకాశం ఉంది. ఈ సదుపాయానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హత పొందిన 733 మంది వయోవృద్ధులు, 124 మంది వికలాంగులు తమ ఇళ్ల వద్దే ఈ సదుపాయాన్ని వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే ఈ పోలింగ్‌ మొదలైంది. ఇందుకోసం 47 టీమ్స్‌ పని చేస్తున్నాయి. జిల్లాలోని 15 నియోజక వర్గాలకు గాను ఒక్క కంటోన్మెంట్‌లో తప్ప మిగతా చోట్ల ఈ పోలింగ్‌ మొదలైంది. కంటోన్మెంట్‌లో 22వ తేదీన మొదలవుతుంది. ఈ మేరకు ఇప్పటికే సదరు ఓటర్లకు సమాచారం అందింది.ఒకటి రెండు రోజుల్లో ఇది పూర్తవుతుంది.

వీరు కాక ఇంకా ఏయే వర్గాల వారు ఇళ్ల వద్ద పోలింగ్‌లో పాల్గొనవచ్చు?

వేరే ఎవరికీ ఈ సదుపాయం లేదు. పోలింగ్‌ విధుల్లో పాల్గొనే పోలీసు, పోలింగ్‌ సిబ్బందితో పాటు పోలింగ్‌ రోజున ఎన్నికల విధులకు హాజరయ్యే 13 అత్యవసర సేవల విభాగాల్లోని వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం ఉంది. ఈ విభాగాల్లోని వారికి పోస్టల్‌ బ్యాలెట్‌ అంటే పోస్టులో పంపేది కాదు. ఇందుకు దరఖాస్తు చేసుకున్నవారు నిర్ణీత తేదీల్లో సూచించిన కార్యాలయానికి వెళ్లి ముందస్తుగానే ఓటు వేయవచ్చు. పోలీసులకు, పోలింగ్‌ విధులకు హాజరయ్యే వారికి ఈ పోలింగ్‌ కూడా మొదలైంది. మిగతా 13 అత్యవసర విభాగాల నుంచి మాత్రం ఎవరూ దరఖాస్తు చేసుకోలేదు.

జిల్లాలో ఎన్ని పోలింగ్‌ కేంద్రాలున్నాయి.. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?

పెరిగిన ఓటర్ల సంఖ్యకనుగుణంగా అనుబంధ పోలింగ్‌ కేంద్రాలతో వెరసీ.. మొత్తం 4,119 పోలింగ్‌ కేంద్రాలుంటాయి. ప్రజలు సౌలభ్యంగా ఓటు వేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఎక్కడైనా ఏవైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినా వెంటనే గుర్తించేందుకు అన్ని పోలింగ్‌ కేంద్రాల నుంచి వెబ్‌కాస్టింగ్‌ ఉంటుంది. ఎన్నికల సంఘం ఎంపిక చేసిన ఏజెన్సీ ఈ ఏర్పాట్లు చేస్తుంది. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లోని పరిస్థితుల్ని ఎన్నికల సంఘం నుంచి, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి కూడా పరిశీలించవచ్చు.

పోలింగ్‌ శాతం పెరగనుందా?

నగరంలో పెద్ద సమస్య ఎక్కువమంది ఓట్లు వేయకపోవడం. గత అనుభవాల నుంచి వీలైనంతమేర పోలింగ్‌ శాతం పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం.ఇప్పటికే వివిధ కార్యాలయాల్లో, సంస్థల్లో, హోటళ్లలో, చౌరాస్తాల్లో, పర్యాటక ప్రాంతాల్లోనే కాక హైకోర్టు వంటి ప్రాంతాల్లోనూ ఓటరు అవగాహన కోసం ‘స్వీప్‌’ (సిస్టమేటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పార్టిసిపేషన్‌) కార్యక్రమాలు నిర్వహించాం. రెసిడెన్షియల్‌వెల్ఫేర్‌ అసోసియేషన్ల భాగస్వామ్యంతోనూ ఈ కార్యక్రమాలు నిర్వహించాం. వివిధ రంగాల్లోని సెలబ్రిటీలతోనూ ప్రచారం నిర్వహించాం. ఇంకా ఎవరు ఏ సలహాలిచ్చినా పోలింగ్‌ పెరిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం. భారీ క్యూలలో నుంచోలేక చాలామంది పోలింగ్‌కు దూరంగా ఉంటున్నారనే సమాచారం ఉండటంతో, ఆన్‌లైన్‌ ద్వారా పోలింగ్‌ కేంద్రంలో ఏ గంటకు ఎంత క్యూ ఉందో తెలుసుకునే ఏర్పాట్లు చేస్తాం. దానిద్వారా పోలింగ్‌ కేంద్రానికి వెళ్లేవారు ప్లాన్‌ చేసుకోవచ్చు. మహిళలకు, యువతకు ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలు కూడా ఉంటాయి. మిగతా వాటికంటే అవి కొంత భిన్నంగా, ఓటర్లను ఆకర్షించేలా ఉంటాయి.

పోలింగ్‌ ఏర్పాట్ల పరిస్థితి ఎలా ఉంది?

ఓటరు స్లిప్పుల పంపిణీ ఎంతవరకొచ్చింది ?

వాటిని ఓటరు ఇన్ఫర్మేషన్‌ స్లిప్స్‌ అంటున్నాం. వాటి ద్వారా ఓటర్లకు తమ పోలింగ్‌ కేంద్రం చిరునామా, పోలింగ్‌ బూత్‌ నెంబర్‌, తదితర వివరాలు తెలుస్తాయి. క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. స్లిప్‌లోని సమాచారంతో సులభంగా చేరుకోవచ్చు. గూగుల్‌మ్యాప్స్‌ ద్వారానూ తెలుసుకోవ చ్చు. 23వ తేదీకల్లా ఈ పంపిణీ పూర్తి చేయాలనేది లక్ష్యం. వీటితోపాటు ఓటు వేసేందుకు ఓటరుకు తగిన అవగాహన కలిగేలా చిన్న పుస్తకం కూడా పంపిణీ చేస్తున్నాం.

మరిన్ని వార్తలు