మారుతీ చేతికి గుజరాత్‌ ప్లాంట్‌

21 Nov, 2023 06:07 IST|Sakshi

వాటాదారుల గ్రీన్‌సిగ్నల్‌

న్యూఢిల్లీ: మాతృ సంస్థ సుజుకీ మోటార్‌ కార్పొరేషన్‌(ఎస్‌ఎంసీ)కు ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో షేర్ల జారీకి వాటాదారులు అనుమతించినట్లు మారుతీ సుజుకీ ఇండియా తాజాగా వెల్లడించింది. దీంతో సంబంధిత పార్టీ లావాదేవీకింద సుజుకీ మోటార్‌ గుజరాత్‌(ఎస్‌ఎంజీ)లో 100 శాతం వాటాను సొంతం చేసుకోనుంది. ఇందుకుగాను రెండు ప్రత్యేక అంశాలపై పోస్టల్‌ బ్యాలట్‌ ద్వారా మారుతీ గత నెలలో వాటాదారుల నుంచి అనుమతిని కోరింది. రెండు సంస్థల మధ్య ఒప్పందం(సంబంధిత పార్టీ లావాదేవీ)తోపాటు.. నగదుకాకుండా ప్రిఫరెన్షియల్‌ పద్ధతిలో షేర్ల కేటాయింపుపై ఓటింగ్‌కు తెరతీసింది.

ఈ రెండు అంశాలకూ వాటాదారుల నుంచి 98 శాతానికిపైగా అనుకూలంగా ఓట్లు లభించినట్లు మారుతీ తాజాగా వెల్లడించింది. గత నెలలో రూ. 12,841 కోట్లకు ఎస్‌ఎంజీని కొనుగోలు చేసేందుకు కంపెనీ బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచి్చన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా రూ. 5 ముఖ విలువగల ఒక్కో షేరుకీ దాదాపు రూ. 10,241 ధరలో మొత్తం 1.23 కోట్ల ఈక్విటీ షేర్ల జారీకి ఆమోదముద్ర వేసింది. వెరసి ఎస్‌ఎంజీలో 100 శాతం వాటాను సొంతం చేసుకునే బాటలో ప్రిఫరెన్షియల్‌ జారీకి మారుతీ బోర్డు తెరతీసింది. ఈ లావాదేవీతో మారుతీలో ఎస్‌ఎంసీకిగల వాటా 56.4 శాతం నుంచి 58.28 శాతానికి బలపడనుంది. మరోవైపు ఎస్‌ఎంజీ మారుతీకి పూర్తి అనుబంధ కంపెనీగా ఆవిర్భవించనుంది.

మరిన్ని వార్తలు