రోడ్డు ప్రమాదంలో ముగ్గురి దుర్మరణం

3 Dec, 2013 04:42 IST|Sakshi

=మరొకరికి తీవ్ర గాయాలు
 =మితిమీరిన వేగం ప్రమాదానికి కారణం

 
దుండిగల్, నూస్‌లైన్: అతి వేగం ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఓవర్‌టేక్ చేయబోయిన ఆటో ముందు వస్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్తున్న ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. ఇంకో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన సోమవారం దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..

నల్లగొండ జిల్లా తిమ్మాపురానికి చెందిన భార్యాభర్తలు వెంకటేశ్, రాజేశ్వరి (30), రంగారెడ్డి జిల్లాకు చెందిన తాండూర్‌కు చెందిన దంపతులు నర్సింహ, చిట్టెమ్మ(34) నగరంలోని నిజాంపేట రాజీవ్ గృహకల్ప సముదాయంలో ఉంటున్నారు. కాగా డ్వాక్రా గ్రూపు రాజీవ్‌గాంధీ పొదుపు జ్యోతి సంఘానికి రాజేశ్వరి, చిట్టెమ్మ టీమ్ లీడ్లరుగా వ్యవహరిస్తున్నారు. సోమవారం గండిమైసమ్మలోని ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో డబ్బులు డ్రా చేసేందుకు రాజీవ్‌గృహకల్పలో ఆటో ఎక్కారు.

అది బౌరంపేట సమీపంలోని డాంబర్ ప్లాంట్ వద్ద ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్‌టెక్ చేయబోయి ఎదురుగా వస్తున్న హర్యానాకు చెందిన కంటైనర్‌ను ఢీ కొట్టింది. లారీ ఎదురుగా వేగంగా ఢీకొట్టడంతో పాటు సుమారు 20 అడుగుల వరకు ఆటోను లాక్కెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడ్డ రాజేశ్వరి, చిట్టెమ్మలతో పాటు బాచుపల్లి సాయినగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ నర్సింహ(40) అక్కడికక్కడే మృతి చెందారు. నర్సింహ అల్లుడు నరేశ్‌కు తీవ్ర గాయాలవడంతో అతన్ని 108లో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. రాజేశ్వరి, చిట్టెమ్మల తలలు నుజ్జునుజ్జయ్యాయి. కంటైనర్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. దుండిగల్ సీఐ బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేసుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. మృతదేహాలను గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాపులో ఉంది.
 
రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు

రాజేశ్వరి, చిట్టెమ్మల మృతితో నిజాంపేట రాజీవ్ గృహకల్పలో విషాదఛాయలు అలుముకున్నాయి. డ్వాక్రా గ్రూపునకు లీడర్లుగా వ్యహరిస్తూ ఎంతో కలివిడిగా ఉండే వారి హఠాన్మరణంతో ఆ ప్రాంత మహిళలు కన్నీరు మున్నీరయ్యారు. రాజేశ్వరి, చిట్టెమ్మలు దినసరి కూలీలుగా పని చేస్తుండగా.. వీరిద్దరికీ ఇద్దరు చిన్న పిల్లలున్నారు. కాగా చిట్టెమ్మ భర్త నర్సింహ మానసిక స్థితి బాగాలేదని స్థానికులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు