మారిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు

10 Jan, 2017 23:57 IST|Sakshi
మారిన రీజినల్‌ రింగ్‌ రోడ్డు

ఫార్మాకు దక్షిణం వైపు రీజినల్‌ రింగ్‌ రోడ్డు
అలైన్‌మెంట్‌ మార్చేందుకు సర్కారు కసరత్తు
భవిష్యత్తు అవసరాల కోసం తప్పదన్న కన్సల్టెన్సీ
నేడు జరిగే సమావేశంలో తుది నిర్ణయం


రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్‌) దిశ మార్చుకుంటోంది. ఔషధనగరి (ఫార్మాసిటీ) సమీపంలో ఈ రోడ్డు అలైన్‌మెంట్‌ మారుతోంది. ప్రతిష్టాత్మక ఫార్మాసిటీకి దక్షిణం వైపు నుంచి ఈ మార్గాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుత ఔటర్‌రింగ్‌ రోడ్డుకు ఆవల నుంచి ప్రాంతీయ బాహ్య వలయ దారిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాజధానిపై వాహనాల భారం తగ్గించే లా 338 కిలోమీటర్ల మేర ఈ రహదారిని అభివృద్ధి చేయాలని ప్రతిపాదించింది. అందుకు అనుగుణంగా నిర్మాణ వ్యయాన్ని భరించేం దుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కింద ఈ రోడ్డును చేపట్టేలా ఖరారు చేయాలని, సాధ్యమైనంత త్వరగా ఖరారు చేసి ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించింది. అయితే, ఆదిలోనే హంసపాదులా ఫార్మాసిటీ రూపంలో ఈ రోడ్డుకు అడ్డంకి వచ్చింది. కందుకూరు, యాచారం, కడ్తాల మండలాల పరిధిలో దాదాపు 19వేల ఎకరాల విస్తీర్ణంలో ఔషధన గరిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులోభాగంగా ఇప్పటికే దాదాపు ఏడు వేల ఎకరాల భూమిని కూడా సేకరించింది. ఈ ఏడాది చివరినాటికి ప్రాజెక్టుకు భూమి పూజ కూడా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు శ్రీశైలం–సాగర్‌ హైవేల మధ్య 11 కిలోమీటర్ల రహదారిని అభివృద్ధి చేస్తోంది.

రింగ్‌రోడ్డుతో భారీ నష్టం!
అత్యున్నతస్థాయి ప్రమాణాలతో ప్రపంచంలోనే మూడో అతిపెద్దదిగా ఆభివర్ణిస్తున్న ఫార్మాసిటీకి రీజిన ల్‌ రింగ్‌రోడ్డుతో నష్టం వాటిల్లనుందని ఈ ప్రాజెక్టుకు మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్న ‘సురబాన జ్యూరంగ్‌’ కన్సల్టెన్సీ తేల్చిచెప్పింది. ఔషధనగరికి ఉత్తరం వైపు నుంచి రింగ్‌రోడ్డును ప్రతిపాదిస్తూ హెచ్‌ఎం డీఏ మాస్టర్‌ ప్లాన్‌లో పొందుపరిచింది. ఈ ప్రతిపాదిత రహదారితో భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే అవకాశముందని, వీటిని అధిగమించేందుకు దక్షిణ దిశలో రీజినల్‌ రింగ్‌రోడ్డును నిర్మించ డం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తద్వారా ఔషధనగరికి ఇబ్బంది కలుగకుండా.. సాధారణ ప్రయాణికులు ఆవస్థల పాలుగాకుండా నివారించవచ్చని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వాని కి ఇటీవల నివేదిక ఇచ్చింది. వాస్తవానికి ప్రస్తుతం షాద్‌నగర్‌ మీదుగా కందుకూరు మండలం కొత్తూ రు నుంచి మంచాల మండలం ఆగాపల్లి మీదుగా సాగుతుంది. ప్రతిపాదనలు పరిశీలిస్తే.. కడ్తాల సమీపం గుండా ఈ రహదారిని నిర్మించే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

నేడు కీలక సమావేశం
రీజినల్‌ రింగ్‌రోడ్డు రీఅలైన్‌మెంట్‌పై బుధవారం సచివాలయంలో అత్యున్నతస్థాయి సమావేశంలో జరుగుతోంది. ఈ సమావేశంలో ఫార్మాసిటీ సమీపంలో ఈ రహదారి అలైన్‌మెంట్‌ మార్పుపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఆర్‌అండ్‌బీ, పరిశ్రమలు, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శులు, హెచ్‌ఎండీఏ కమిషనర్, ఎన్‌హెచ్‌ఐఏ ప్రాంతీయ అధికారి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ పాల్గొనున్నారు.

మరిన్ని వార్తలు