ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చారు?

28 Sep, 2023 03:35 IST|Sakshi

రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అక్రమాలు ప్రజలందరికీ తెలుసు 

అధికారం కోసం టీడీపీ, జనసేన అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారు 

ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

మంగళగిరి: ‘ఇన్నర్‌ రింగ్‌ రోడ్డే లేదు.. దాంతో తనకు సంబంధం ఏమిటి అంటున్న నారా లోకేశ్‌ ఆ రింగ్‌ రోడ్డు నిర్మాణానికి షబ్బానా వాళ్లను ఎందుకు కన్సల్టెంట్‌గా నియమించారు’ అని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నిలదీశారు. బుధవారం ఎయిమ్స్‌ ఆస్పత్రి పక్కన అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన టెంపుల్‌ హిల్‌ ఎకో పార్కు ప్రారంభోత్సవానికి హాజరైన ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో మాట్లాడారు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డుకు ముందుగా ఇచ్చినట్టు కాకుండా లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, హెరిటేజ్‌ డైరెక్టర్‌ లోకేశ్‌ పేరిట కొన్న భూముల మీదుగా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు అలైన్‌మెంట్‌ ఎందుకు మార్చాల్సి వచ్చిందని ప్రశ్నించారు.

నిజాయితీపరుడైన అప్పటి సీఆర్‌డీఏ కమిషనర్‌ నాగులాపల్లి శ్రీకాంత్‌ వారి మాట వినడం లేదని ఆయనను మార్చేసి సీఆర్‌డీఏ కమిషనర్‌గా అర్హత లేని అప్పటి గుంటూరు జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌ను నియమించడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తాను అన్ని ఆధారాలు, సాక్ష్యాలతో సహా రికార్డులను సేకరించి సీఐడీ అధికారులకు అప్పగించానని చెప్పారు.

చంద్రబాబు రాజధాని పేరుతో ప్రతి అంశాన్ని ఆయన స్వార్థానికి, ఆయన మనుషుల స్వార్థానికి ఎంతలా వాడుకున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. లింగమనేని రమేష్, మాజీ మంత్రి నారాయణ, రామకృష్ణ హౌసింగ్‌ వాళ్లతో పాటు హెరిటేజ్‌ పేరుతో కొన్న భూములు సుమారు 650 ఎకరాలకు లబ్ధి చేకూరేలా ఇన్నర్‌ రింగ్‌ రోడ్డును మార్చిన వాట వాస్తవం కాదా అని నిలదీశారు. 

అనైతిక పొత్తులను ప్రజలు గమనిస్తున్నారు 
టీడీపీ అధికారమే పరమావధిగా జనసేనతో అనైతిక పొత్తులు పెట్టుకోవడాన్ని ప్రజలు గమనిస్తున్నారని ఆర్కే పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలలో తగిన  బుద్ధి చెబుతారని హెచ్చరించారు. కరోనా లాంటి ఇబ్బందులు వచ్చినా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, కుల మతాలకు అతీతంగా ఎలాంటి అవినీతికి తావు లేకుండా నేరుగా డీబీటీ ద్వారా రూ.లక్షల కోట్లు పంపిణీ చేసి సంక్షేమాన్ని ఇంటికి చేర్చినట్టు చెప్పారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పినట్టు వైనాట్‌ 175 జరిగి తీరుతుందనే నమ్మకం ఉందన్నారు.

మరిన్ని వార్తలు