తుపాకులతో బెదిరిస్తూ తెలుగు ప్రొఫెసర్లతో పాఠాలు?

6 Jan, 2016 20:34 IST|Sakshi
తుపాకులతో బెదిరిస్తూ తెలుగు ప్రొఫెసర్లతో పాఠాలు?

న్యూఢిల్లీ: ఇంట్లో ఆర్థిక సమస్యలు. మాతృదేశంలో ఉద్యోగాలు కరువు.. కళ్లముందు బోలెడు సమస్యలు వెరసి ఎలాగైనా ఓ ఉద్యోగం చేయాలనే తపన వారిని ప్రమాదభరిత ప్రాంతాల్లో సైతం ఉద్యోగాలకు వెళ్లేలా చేసింది. విదేశాల్లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు చేసుకోగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల ప్రభావం ఎక్కువగా ఉండే లిబియాలో ఉద్యోగం వచ్చింది. సిర్తీ విశ్వవిద్యాలయంలో విధుల్లో చేరారు. సెలవుల్లో భాగంగా తిరుగు ప్రయాణం అయినవారిని దురదృష్టం వెంటాడింది.

దాదాపు రెండు నెలలుగా వారి గురించి ఇసుమంత జాడకూడా తెలియకుండా పోయింది. ఇది లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు బలరాం, గోపీకృష్ణల కథ. బలరాం, గోపికృష్ణలు గత ఏడాది జూలై చివరి వారంలో భారత్ కు తిరిగి వచ్చేందుకు ట్యునిషియా ఎయిర్ పోర్టుకు వస్తుండగా వారిని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. అప్పటి నుంచి వారి జాడ కరువైంది.

కానీ, విద్యార్థులకు పాఠాలు చెప్పేందుకు వెళ్లిన వారిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లి ఉగ్రవాదులు తమకు పాఠాలు చెప్పించుకుంటున్నారని తాజాగా తెలిసింది. వారి ప్రాణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా బెదిరింపులకు మాత్రమే దిగుతూ పాఠాలు చెప్పించుకుంటున్నారని, ఈ కృతజ్ఞతాభావంతోనైనా ఆ ఉగ్రవాదులు తమవారిని విడిచిపెడతారని ఆశిస్తున్నట్లు వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది. వీరితోపాటు ఎంతోమందిని ఇలాగే ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లి పాఠాలు చెప్పించుకుంటున్నారట.

 

బలరాం భార్య శ్రీదేవీ ఈ విషయంపైనే ఓ మీడియాతో మాట్లాడుతూ 'ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తమవారితో బలవంతంగా పాఠాలు చెప్పించుకుంటున్నారని నాకు మూడు నెలల కిందట భారత దౌత్య కార్యాలయం, స్థానికుల సమాచారం ద్వారా తెలిసింది. నేను ప్రతి రోజు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పీఏకు ఫోన్ చేస్తున్నాను. వారు సురక్షితంగా ఉన్నారని చెప్తున్నారు. దీంతో వారు క్షేమంగా తిరిగొస్తారన్న భరోసాతో ఉంటున్నాను. ఈ సమయంలో నా కుటుంబం నాకు ఎంతో ధైర్యాన్ని ఇస్తున్నా కొంత గుబులుగానే ఉంది' అని చెప్పింది.

ఇక గోపి కృష్ణ సోదరుడు మురళీ కృష్ణ మాట్లాడుతూ.. తమ సోదరుడిని సెప్టెంబర్ 2014లో చూశామని, ఫిబ్రవరి 29 తన పుట్టినరోజని ఆ నాటికైనా తాను వస్తాడని తాము ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమ కుటుంబ పరిస్థితి దయనీయంగా మారిందన్నాడు. వీరితోపాటు కర్ణాటకకు చెందిన ఎస్ విజయ్ కుమార్, లక్ష్మీ కాంత్ రామకృష్ణ అనే ఇద్దరిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినా అనంతరం విడిచిపెట్టారు.

మరిన్ని వార్తలు