సర్వీసు పరిగణన 58 ఏళ్ల వరకే

12 Apr, 2016 04:17 IST|Sakshi
సర్వీసు పరిగణన 58 ఏళ్ల వరకే

♦ ఆ తర్వాత చెల్లుబాటు కాదు
♦ ఉత్తర్వులిచ్చిన తెలంగాణ ఆర్థిక శాఖ

 సాక్షి, హైదరాబాద్: రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల పంపిణీలో భాగంగా తెలంగాణకు కేటాయించిన ఉద్యోగుల రిటైర్‌మెంట్, సర్వీసు కాలంపై స్పష్టత ఇస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులిచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం అక్కడి ఉద్యోగుల పదవీ కాలాన్ని 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచింది. తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా 58 ఏళ్ల పదవీ కాలాన్ని కొనసాగించింది. అయితే 58 ఏళ్లకు పైబడ్డ ఉద్యోగులు ఇప్పటికీ ఏపీలో విధులు నిర్వర్తిస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల తుది కేటాయింపులో వీరు తెలంగాణకు వస్తే సర్వీసు కాలం, రిటైర్‌మెంట్ తేదీని ఎలా పరిగణించాలనే చిక్కుముడి తలెత్తింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం అందుకు సంబంధించిన స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు సోమవారం (జీవో నం.47) ఉత్తర్వులు జారీ చేశారు. 58 ఏళ్లకు మించి ఏపీలో పనిచేసిన ఉద్యోగులు తుది పంపిణీలో తెలంగాణకు వచ్చినట్లయితే వారి రిటైర్‌మెంట్ వయస్సు 58 ఏళ్లు నిండిన తేదీనే పరిగణించాల్సి ఉంటుందని అందులో స్పష్టం చేశారు. ఆ వయస్సు దాటి పని చేసిన కాలాన్ని ‘జస్ట్ సర్వీస్’గా పరిగణిస్తామని అందులో పేర్కొన్నారు. పెన్షన్ ప్రయోజనాలు, ఇంక్రిమెంట్లకు ఈ కాలం చెల్లుబాటు కావని... ఈ అదనపు కాలంలోని లీవులు సైతం పరిగణనలోకి రావని పేర్కొంది.

>
మరిన్ని వార్తలు