తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈ

20 Aug, 2014 01:40 IST|Sakshi
తాత్కాలికం అంటే శాశ్వతమని కాదు: కేఈ

విజయవాడపై నారాయణది తొందరపాటు ప్రకటన
దాంతో ఆ ప్రాంతంలో ధరలు విపరీతంగా పెరిగాయి
కానీ, మేం ప్రభుత్వ ధరల ప్రకారమే భూములు సేకరిస్తాం

 
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయవాడ తాత్కాలిక రాజధాని అంటే అర్థం అదే శాశ్వత రాజధాని అని కాదని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి కేఈ కృష్ణమూర్తి స్పష్టంచేశారు. రాజధాని నగరం అన్ని ప్రాంతాల వారికి అందుబాటులో ఉండే విధంగా మధ్యలో ఉండాలన్నారు. విజయవాడ, గుంటూరు మధ్యే ఆంధ్రప్రదేశ్  రాజధాని ఉంటుందని పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదన్నారు.

ఆయన తొందరపాటు ప్రకటనవల్ల ఆ ప్రాంతంలో భూముల ధరలు విపరీతంగా పెరిగాయని అసంతృప్తి వ్యక్తంచేశారు. కర్నూలు లేదా రాయలసీమ ప్రాంతంలో రాజ దాని ఉండాలని కోరే వారి సంఖ్య తక్కువగా ఉందని, వారికి నాయకత్వం వహించే వారు కూడా లేరని చెప్పారు. ఆయన మంగళవారం అసెంబ్లీ లాబీల్లోని తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడారు.
 
విజయవాడ ఏపీ రాజధాని అని మంత్రి నారాయణ చెప్పింది అధికారికం కాదు. తాత్కాలిక రాజధాని ఒక ప్రాంతంలో ఏర్పాటు చేసిన తరువాత స్థానికంగా భూములు ధరలు పెరిగితే మరోచోటికి మారుస్తాం. విజయవాడ ఇరుకు నగరం. అక్కడ ప్రస్తుతం ఎకరా భూమి ధర పది నుంచి పదిహేను కోట్లు ఉంది. రాజధాని ఏర్పడుతుందనే కారణంతో ధరలు పెరి గాయి. ఇప్పుడు అక్కడ రాజధాని ఏర్పాటు కాదని నేను ప్రకటిస్తే రిజిస్ట్రేషన్లు తగ్గిపోతాయి. విజయవాడలో నేను ఇల్లు అద్దెకు తీసుకున్నానన్న వార్తలు అవాస్తవం.

విజయవాడ, గుంటూరు మధ్య ప్రభుత్వ భూమి కేవలం 500 ఎకరాలు మాత్రమే ఉంది. ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ ధర ఎక్కువగా ఉంది. అయితే రాజధాని ఏర్పాటుకు అవసరమైన భూమిని ప్రభుత్వ ధర ప్రకారమే సేకరిస్తాం. ప్రస్తుతం ఎక్కువ ధరకు భూమిని ఇపుడు కొనుగోలు చేసిన వారు అపుడు ఇబ్బందులు పడతారు.
 
మంత్రి నారాయణకు బాబు మందలింపు
ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి పి.నారాయణపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. గత  కొద్ది రోజులుగా మంత్రి పదేపదే విజయవాడ, గుంటూరు మధ్యే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. ప్రజల్లో కోరికలు ఎక్కువగా ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నారని, ఈ తరుణంలో ఒక ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రకటించటం సరికాదని బాబు నారాయణకు సూచించారు. పార్టీలోని సీనియర్లందరినీ కలుపుకుని పోవాలని చెప్పారు.
 
శివరామకృష్ణన్ నివేదిక తర్వాతే రాజధానిపై నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నివేదిక అందిన తర్వాతే కొత్త రాజధాని ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని శాసన మండలిలో ఏపీ మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. కమిటీ నివేదిక అందిన తర్వాత సభ్యులందరితో మాట్లాడి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్న తర్వాతే రాజధాని ఎంపికపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి తెలిపారు.

మరిన్ని వార్తలు