ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు

19 Jul, 2017 02:55 IST|Sakshi
ప్రాజెక్టుల్లోకి క్రమంగా ప్రవాహాలు
- ఎగవ గైక్వాడ్‌ ప్రాజెక్టుల్లోకి 13 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
సింగూరు, ఎస్సారెస్పీకి మొదలైన ప్రవాహం
మధ్యతరహా ప్రాజెక్టుల్లోనూ ఆశాజనకం  
 
సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు క్రమంగా పుంజుకుంటున్నాయి. అలాగే ఎగువ నుంచి వస్తున్న నీటి ప్రవాహాలు దిగువ ప్రాజెక్టుల్లోకి వచ్చి చేరుతుండటంతో సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఆశాజనక పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఎగువ కర్ణాటకలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టికి స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు రోజుకు 2.5 టీఎంసీల మేర నీరు వచ్చి చేరగా అది మంగళవారానికి 3 టీఎంసీలకు చేరింది.

35,500 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తుండటంతో అక్కడ నిల్వలు 51.81 టీఎంసీలకు చేరాయి. తుంగభద్రలోకి సైతం రోజుకు 4 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. నారాయణపూర్‌లోకి పెద్దగా ప్రవాహం లేకపోవడంతో దిగువ జూరాలకు నీటి ప్రవాహాలు కరువయ్యాయి. శ్రీశైలం నుంచి నీటి విడుదలతో నాగార్జున సాగర్‌లోకి 6 వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరి బేసిన్‌లోని ఉపనదుల్లో ప్రవాహాలు వచ్చి చేరడంతో సింగూరుకు 1,800 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీంతో ఇక్కడ నీటి నిల్వ 29.9 టీఎంసీలకుగానూ 18.2 టీఎంసీల మేర ఉంది. ఎస్సారెస్పీకి 600, నిజాంసాగర్, కడెంలకు 230 క్యూసెక్కుల మేర ప్రవాహం వస్తోంది.

అయితే ఎగువ మహారాష్ట్రలో భారీగా వర్షాలు కురుస్తుండటం, గైక్వాడ్‌ ప్రాజెక్టుకు 13 వేల క్యూసెక్కుల మేర ప్రవాహాలు ఉన్న నేపథ్యంలో దిగువకు త్వరలోనే నీరొచ్చే అవకాశం ఉందని నీటిపారుదలశాఖ అంచనా వేస్తోంది. మరోవైపు మధ్యతరహా ప్రాజెక్టులైన తాలిపేరుకు 8,500, వైరాకు 2,763, కిన్నెరసానికి 3,761, పెద్దవాగుకు 1,176, లంకసాగర్‌కు 544 క్యూసెక్కుల మేర ప్రవాహాలు వస్తున్నాయి. 
>
మరిన్ని వార్తలు