ఇదీ మా పనితీరు.. మీ సూచనలేంటి?

3 Jun, 2016 03:07 IST|Sakshi
ఇదీ మా పనితీరు.. మీ సూచనలేంటి?

సలహాలు, సూచనలు ఆహ్వానించిన సీఎం
లేఖ రాసినా పరిగణనలోకి తీసుకుంటానని వెల్లడి
♦ గవర్నర్ సూచనలతో ప్రత్యేక సభ
సాక్షి కార్టూనిస్ట్ శంకర్ సహా 64 మందికి సన్మానం

 సాక్షి, హైదరాబాద్: పోరాడి సాధించుకున్న తెలంగాణను ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాల్సింది గా వివిధ రంగాల ప్రముఖులు, ప్రజలను సీఎం కేసీఆర్ కోరారు. గురువారం హెచ్‌ఐసీసీలో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల వేదిక మీదుగా ఈ మేరకు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం పరేడ్  మైదానంలో ప్రధాన ఘట్టం ముగిసిన తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు హెచ్‌ఐసీసీలో కార్యక్రమం జరగాల్సి ఉంది.

కానీ సీఎం, గవర్నర్ నరసింహన్ తదితరులు మధ్యాహ్నం 2.30 గంటలకు వచ్చారు. ఆ తర్వాత సభ మొదలైంది. వివిధ జిల్లాల నుంచి మూడు వేల మంది ఇందులో పాల్గొన్నారు. బంగారు తెలంగాణ కోసం చేస్తున్న పనితీరును సీఎం సభికుల ముందుంచారు. ప్రభుత్వ కార్యక్రమాలు, వాటి ఫలితాలను వివరించారు. ఇంకేచేస్తే బాగుంటుందో చెప్పాలంటూ కోరారు. లేఖ రాసినా తాను పరిగణనలోకి తీసుకుంటానని చెప్పారు. ఇది తనకు గవర్నర్ నరసింహన్ ఇచ్చిన సలహా అంటూ ఆయన్ను పొగడ్తల్లో ముంచెత్తారు. ఆ తర్వాత గవర్నర్ కూడా ఈ కార్యక్రమం తన సూచన మేరకే జరిగిందన్నారు.

 64 మందికి సన్మానం..
అంతకుముందు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన 64 మందికి  రూ.లక్ష నూటపదహార్ల నగదు పురస్కారం, శాలువా, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి ఘనంగా సన్మానించారు. పాత్రికేయ విభాగంలో ‘సాక్షి’ పత్రిక కార్టూనిస్టు శంకర్‌ను సీఎం, గవర్నర్ సత్కరించారు. సన్మాన గ్రహీతలు కుటుంబ సభ్యులతో కలిసి హాజరవడంతో ప్రాంగణం కళకళలాడింది. ఇటీవల లాస్‌వేగాస్‌లో జరిగిన యూఎస్ ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన నగర యువతి సయదా ఫలక్‌కు రూ.50 లక్షల పురస్కారం అందించి సత్కరించారు. అంతకు ముందు సాంస్కృతిక సారథి బృందం సభ్యులు నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది.

సభ మొదలయ్యాక సీఎం ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్‌తోపాటు ప్రభుత్వ సంగీత కళాశాల ఆచార్యులు ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. 64 మందికి సన్మానం తర్వాత కాస్త గందరగోళం నెలకొంది. కరాటే ఛాంపియన్ సయదా ఫలక్‌ను అప్పటికి వేదికపైకి ఆహ్వానించకపోవటంతో సీఎం కాస్త ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సలహాదారు రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశంను పిలిపించి దీనిపై ప్రశ్నించారు. అప్పటి వరకు సన్మాన గ్రహీతలను ఆహ్వానించిన దేశపతి శ్రీనివాస్ సభికుల్లోకి వచ్చి కూర్చోవటంతో గందరగోళం నెలకొంది. ఇదే కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. చివర్లో అందరికీ అక్కడే పసందైన విందు ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు