చిన్న పరిశ్రమలకు సహకారమేదీ?

5 Sep, 2017 02:20 IST|Sakshi
చిన్న పరిశ్రమలకు సహకారమేదీ?
బ్యాంకుల తీరుపై మంత్రి కేటీఆర్‌ అసంతృప్తి
- ముంబైలో ఆర్‌బీఐ గవర్నర్‌ను కలసి సమస్యల ప్రస్తావన
ఖాయిలా పరిశ్రమల గుర్తింపు, వేలంలో 
బ్యాంకులు మార్గదర్శకాలు పాటించట్లేదని ఫిర్యాదు
ఈ అంశంపై సహకారం కోరుతూ లేఖ అందజేత
ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ను ఎన్‌బీఎఫ్‌సీగా గుర్తించాలని విజ్ఞప్తి  
 
సాక్షి, హైదరాబాద్‌: బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి చిన్నతరహా పరిశ్రమలకు ఆశించిన మేర సహకారం లభించట్లేదని రాష్ట్ర పరిశ్రమ లు, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవేదన వ్యక్తం చేశారు. ముంబై పర్యటనలో ఉన్న కేటీఆర్‌ సోమవారం ఈ మేరకు ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌తో సమావేశమై చిన్నతరహా పరిశ్రమల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ విషయంలో ఆర్‌బీఐ నుంచి అందించాల్సిన సహకారంపై లేఖను సమర్పించారు.

కేటీఆర్‌ మాట్లాడుతూ ఆర్‌బీఐ మార్గదర్శకాలు పాటించకుండానే బ్యాంకులు చిన్నతరహా పరిశ్రమలను ఖాయిలా పరిశ్రమలుగా గుర్తించి వేలం వేస్తున్నాయన్నారు. చిన్నతరహా పరిశ్రమలను నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ)గా గుర్తించే విషయంలోనూ మార్గదర్శకాలను పాటించట్లే దని, ఎన్‌పీఏలుగా గుర్తించిన 15 రోజులకే వేలం నిర్వహిస్తున్నాయన్నారు. నిబంధనల మేరకు టెక్నో వయబిలిటీ స్టడీ జరపట్లేదని, కనీసం 17 నెలల గడువూ ఇవ్వట్లేదని ఆయన పేర్కొన్నారు. అలాగే బకాయిలపై నిర్ణయానికి జిల్లాస్థాయి బ్యాంకర్ల కమిటీని ఏర్పాటు చేయట్లేదని, స్టేట్‌ లెవల్‌ ఇంటర్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ కమిటీని సైతం పునరుద్ధరించలేదన్నారు. 
 
హెల్త్‌ క్లినిక్‌ పేరిట ఆర్థిక సాయం
రాష్ట్రంలోని 69,120 సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల్లో 8,618 ఖాయిలా పరిశ్రమలు ఉన్నాయని, వాటిని గుర్తించి తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టినట్లు కేటీఆర్‌ తెలిపారు. ఇందుకోసం రూ. 100 కోట్లతో కార్పస్‌ ఫండ్‌ ఏర్పాటు చేసి హెల్త్‌ క్లినిక్‌ల ద్వారా ఆర్థిక సాయం చేస్తున్నామన్నారు. ఈ నేపథ్యంలో హెల్త్‌ క్లినిక్‌ను బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ (ఎన్‌బీఎఫ్‌సీ)గా గుర్తించాలని ఉర్జిత్‌కు విజ్ఞప్తి చేశారు. 
 
పారిశ్రామికవేత్తలతో కేటీఆర్‌ భేటీ 
ముంబై పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్‌ పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకున్నారు. తొలుత ఐసీఐసీఐ బ్యాంకు సీఈఓ చందా కొచ్చర్‌తో సమావేశమై తెలంగాణ ఇండస్ట్రియల్‌ హెల్త్‌ క్లినిక్, విమెన్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్, డిజిటల్‌ ఇనీషియేటివ్స్‌ అంశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న టీ–æఫండ్‌లో భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం జేఎస్‌డబ్ల్యూ గ్రూప్‌ సీఎండీ సజ్జన్‌ జిందాల్‌తో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. తర్వాత లూపిన్‌ సంస్థ ఎండీ నీలేష్‌ గుప్తాతో సమావేశమై ఫార్మాసిటీలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అలాగే సిర్పూర్‌ పేపర్‌ మిల్లు పునరుద్ధరణ అంశంపై ఐడీబీఐ బ్యాంక్‌ చైర్మన్‌ ఎంకే జైన్‌తో సమావేశమై పేపర్‌ మిల్లు పునరుద్ధరణకు సహకరించాలని కోరారు. కాగా, రాష్ట్రాభివృద్ధిపట్ల కేటీఆర్‌కు ఉన్న నిబద్ధత, ఆలోచనలు ఇతర రాజకీయ నాయకులకూ ఉంటే దేశం ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందంటూ కేటీఆర్‌తో భేటీ అనంతరం సజ్జన్‌ జిందాల్‌ ట్వీట్‌ చేశారు.
 
‘స్టార్టప్‌ స్టేట్‌’లో పెట్టుబడులు పెట్టండి..
ముంబైలో సోమవారం జరిగిన మోతీలాల్‌ ఓస్వాల్‌ లిమిటెడ్‌ యాన్యువల్‌ గ్లోబల్‌ ఇన్వెస్టార్‌ కాన్ఫరెన్స్‌లో స్టార్టప్‌ స్టేట్‌గా మూడేళ్ల తెలంగాణ ప్రయాణం అనే అంశంపై కేటీఆర్‌ ప్రసంగించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాల గురించి వివరించారు. తాము నిబద్ధత, పట్టుదలతో రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. రాష్ట్ర పారిశ్రామిక పాలసీ, ఇతర పాలసీలకు ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రసంశలు లభిస్తున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధి, పెట్టుబడుల సేకరణ వంటి బహుముఖ లక్ష్యాలతో ముందుకెళ్తున్నామన్నారు.  
మరిన్ని వార్తలు