విద్యార్థుల్లో అలజడికి బాధ్యులెవరు?

24 Mar, 2016 13:26 IST|Sakshi
విద్యార్థుల్లో అలజడికి బాధ్యులెవరు?

రోహిత్ వేముల ఆత్మహత్యతో అట్టుడికిపోయిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఇప్పుడిప్పుడే ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో వైస్ చాన్సలర్ అప్పారావు రాక ఒక్కసారిగా అలజడి రేపింది. అప్పారావుకు వ్యతిరేకంగా, అనుకూలంగా క్యాంపస్‌లో మళ్లీ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఇదే పరిస్థితుల్లో జేఎన్‌యూ విద్యార్థి నాయకుడు కన్హయ్య కుమార్ హైదరాబాద్ రాక పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.

రోహిత్ వేముల విద్యార్థిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న వైస్ ఛాన్సలర్ అప్పారావు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయలపై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు దాఖలైన విషయం తెల్సిందే. ఈ కేసు నుంచి విముక్తం కాకముందే, కేసులో క్లీన్‌ చిట్ లభించక ముందే అప్పారావు మళ్లీ వీసీ కుర్చీలో కూర్చోవడంతో అలజడి చెలరేగింది. ప్రశాంత పరిస్థితులను నెలకొల్పేందుకు కృషిచేయాల్సిన పోలీసుల ఓవర్‌యాక్షన్ వల్ల ఉద్రిక్తత తీవ్రమవుతోంది. విద్యార్థులను చితక్కొట్టారు, క్యాంపస్‌లో మెస్‌ను మూసేశారు... విద్యుత్‌ సరఫరా కట్ చేశారు. క్యాంపస్‌లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఆఖరికి మీడియాను కూడా అనుమతించడంలేదు. బుధవారం జేఎన్‌యూ విద్యార్థినేత కన్హయ్య కుమార్‌ను కూడా అనుమతించలేదు.

అప్పారావును మళ్లీ బాధ్యతలు నిర్వహించేందుకు అనుమతించడం అంటే మోదీ ప్రభుత్వం ఈ విషయంలో వెనక్కి తగ్గలేదన్న మాట. పార్టీ చేపట్టిన హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకువెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నదన్న విషయం స్పష్టమవుతోంది. విద్యార్థుల్లో మోదీ ప్రభుత్వం రేపిన చిచ్చు ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకో, జేఎన్‌యూకో పరిమితం కాలేదు. పూణెలోని 'ఫిల్మ్స్ అండ్ టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా', మద్రాస్ యూనివర్సిటీల్లోనూ చిచ్చు రేపింది. ఈ చిచ్చు ప్రస్తుతానికి స్థానిక పరిణామాలకే పరిమితం కావచ్చు. కానీ ప్రతిపక్షాలు అవకాశంగా తీసుకుంటున్నాయి కనుక జరగబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై తప్పక ప్రభావం చూపనుంది.
- ఓ సెక్యులరిస్ట్ కామెంట్

మరిన్ని వార్తలు