తారస్థాయికి ‘అధికార’ అహంకారం

19 Mar, 2016 01:35 IST|Sakshi
తారస్థాయికి ‘అధికార’ అహంకారం

♦ రోజాను అసెంబ్లీలోకి రానివ్వకపోవడం దారుణం
♦ ప్రభుత్వ తీరుపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ఆగ్రహం
♦ జోక్యం చేసుకోవాల్సిందిగా గవర్నర్‌ను కోరాం
♦ స్పీకర్, ముఖ్యమంత్రి కోర్టులకన్నా పెద్దవాళ్లమని భావిస్తున్నారు
♦ నిబంధనలకు విరుద్ధంగా రోజాను సస్పెండ్ చేశారు
♦ ఫిరాయింపు ఎమ్మెల్యేలను కాపాడారు
♦ అసెంబ్లీలో ప్రతిపక్షం గొంతునొక్కేశారు
♦ రోజమ్మకు అండగా నిలబడతాం
 
 సాక్షి, హైదరాబాద్: అధికారపార్టీ అహంకారం తారస్థాయికి చేరిందని, కోర్టులు చెప్పినా ఖాతరు చేయని పరిస్థితుల్లో వారు ఉన్నారని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు కచ్చితంగా తగిన మూల్యం చెల్లిస్తారన్నారు. సస్పెన్షన్‌పై స్టే పొంది అసెంబ్లీకి రావడానికి ప్రయత్నించిన తమ పార్టీ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను అడ్డుకోవడం అన్యాయం, దారుణమని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన గవర్నర్ నరసింహన్‌ను కలసి వినతి పత్రమివ్వడానికి రోజా, సహచర ఎమ్మెల్యేలతో కలసి రాజ్‌భవన్‌కు వచ్చారు. గవర్నర్ లేకపోవడంతో ఆయన కార్యదర్శిని కలిసి.. కోర్టు ఆదేశాలున్నా రోజాను ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయంలో జోక్యం చేసుకోవాల్సిందిగా గవర్నర్‌కు తెలియజేయాలని ఆ వినతిపత్రమిచ్చారు.

అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారపక్షంలో ఉన్న స్పీకరు, ముఖ్యమంత్రి ఇద్దరూ కోర్టుల కన్నా తాము చాలా పెద్ద వాళ్లం అన్నట్లుగా అహంకారం ప్రదర్శిస్తున్నారన్నారు. ‘జరుగుతున్నదంతా కోర్టులు, ప్రజలు చూస్తూ ఉన్నారు. పై నుంచి దేవుడు కూడా చూస్తున్నాడు. కచ్చితంగా రాబోయే రోజుల్లో వీరికి బుద్ధి చెబుతారు’ అని జగన్ అన్నారు. అసలు శుక్రవారం అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూశాక ప్రజాస్వామ్యంలో ఉన్నామా? లేమా? అనే అనుమానాలు కలుగుతున్నాయని, చంద్రబాబు ప్రభుత్వం శాసనసభను పూర్తిగా తన చేతుల్లో పెట్టుకుందన్నారు. ‘స్పీకర్ సభా నిబంధనలకు వ్యతిరేకంగా సభలో టీడీపీ కొమ్ము కాస్తుండటం అందరూ చూస్తున్నారు. నిబంధనలు అనుమతించక పోయినా రోజమ్మను సస్పెండ్ చేశారు.

అసలు ఆమెను 340(2) నిబంధన కింద ఏడాది సస్పెండ్ చేయడం అన్యాయం. ఆ నిబంధన కింద ఆ సెషన్ వరకే సస్పెండ్ చేయవచ్చు. అంతకు మించిన అధికారాలు స్పీకర్‌కు లేవు. అదే విషయం మేమెంతగా చెప్పినా వినకుండా సంవత్సరం పాటు రోజమ్మను సస్పెండ్ చేశారు. అంతే కాదు, వైఎస్సార్‌సీపీ నుంచి గెలిచిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి అవినీతి సొమ్ముతో చంద్రబాబు కొనుగోలు చేశారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడకుండా స్పీకర్, ముఖ్యమంత్రి చంద్రబాబు  ఏ రకంగా కలసి కాపాడారో అందరూ చూశారు. స్పీకర్‌పై 179(సి) నిబంధన కింద అవిశ్వాస తీర్మానానికి సంబంధించి నోటీసు ఇచ్చాం. ఈ నిబంధన ప్రకారం నోటీసు ఇచ్చిన 14 రోజుల తరువాతనే దానిని తీసుకోవాలని స్పష్టంగా ఉంది. సభ్యులకు విప్ జారీ చేయడానికి సమయం ఇవ్వాలని కూడా అందులో ఉంది. కానీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వెసులుబాటు కల్పించేం దుకు, మాకు విప్ సకాలంలో అందలేదని చెప్పుకునేందుకు స్పీకర్ తక్షణమే అవిశ్వాసం నోటీసుపై చర్చ చేపట్టారు. 71వ నిబంధన కింద ఏకంగా 179(సి)నే సస్పెండ్ చేసి చర్చ చేపట్టడం ఎంత దారుణమో అందరూ చూశారు. అసెంబ్లీ లో ప్రతిపక్షం గొంతును నొక్కేశారు’ అని జగన్ అన్నారు.  

 రోజమ్మను రోడ్డుపై వదిలి వెళ్లలేక పోయాం
 మీకు శాసనసభలోపలికి వెళ్లి మాట్లాడే అవకాశం ఉన్నా ఎందుకు వినియోగించుకోలేదు? అని ప్రశ్నించినపుడు, జగన్ ఆవేదనగా సమాధానమిస్తూ ... ‘రోజమ్మను రోడ్డు మీదే విడిచి పెట్టి వెళ్లలేక పోయాం.. అసలు సభలో చంద్రబాబును ప్రశ్నించాలంటేనే మైక్ ఇవ్వరు. ఇక ఇలాంటి అంశంపై ఏకంగా స్పీకర్‌నే ప్రశ్నిస్తే మాకు మైక్ ఇస్తారా!? ఇవాళైతే ఆమెకు మద్దతుగా నిరసన తెలిపాం. తోడుగా నిలబడ్డాం. రేపటి నుంచి మా నిరసన ఎలా తెలపాలనేది సమావేశమై నిర్ణయిస్తాం’ అన్నారు. రాజ్‌భవన్‌కు వచ్చిన వారిలో ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, ఉప్పులేటి కల్పన, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పీడిక రాజన్నదొర, వంతల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, విశ్వాసరాయి కళావతి, కంబాల జోగులు, పాముల పుష్ప శ్రీవాణి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్ యాదవ్, పోతుల రామారావు, జంకె వెంకటరెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, కళత్తూరు నారాయణస్వామి, దేశాయి తిప్పారెడ్డి, ముత్తిరేవుల సునీల్‌కుమార్, మహ్మద్ ముస్తఫా, షేక్ అంజాద్ బాషా, అత్తారు చాంద్‌బాష, రాచమల్లు శివప్రసాదరెడ్డి, పి.రవీంద్రనాథ్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కొక్కిలిగడ్డ రక్షణనిధి, ఆదిమూలపు సురేష్, కొరుముట్ల శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొడాలి నాని, మేకా ప్రతాప అప్పారావు, గొట్టిపాటి రవికుమార్, వై.బాలనాగిరెడ్డి, వై.సాయిప్రసాద్‌రెడ్డి, చిర్ల జగ్గిరెడ్డి, కిడారు సర్వేశ్వరరావు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, వరుపుల సుబ్బారావు, ఆళ్ల రామకృష్ణారెడ్డి, శెట్టిపల్లి రఘురామిరెడ్డి, పార్టీ ముఖ్యనేతలు బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, అంబటి రాంబాబు, కె.పార్థసారథి తదితరులు ఉన్నారు. అంతకు ముందు అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదురుగా ఎమ్మెల్యేలు ధర్నా చేసినపుడు ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్‌చంద్రబోస్, ఆదిరెడ్డి అప్పారావు, మేకా శేషుబాబు తదితరులు వచ్చి సంఘీభావం తెలిపారు.
 
 నా మాటలను వక్రీకరించారు
 తాను అసెంబ్లీలో అనని మాటలను కూడా అన్నట్లుగా అధికారపక్షం వక్రీకరిస్తూ మాట్లాడిందని, న్యాయ వ్యవస్థ మీద తనకు గౌరవం లేదని చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని జగన్ అన్నారు. రోజమ్మ సుప్రీం కోర్టుకు వెళ్లి అక్కడి నుంచి హైకోర్టుకు తన కేసును విచారణకు తెచ్చుకున్నారని, హైకోర్టు ఆమెకు అన్యాయం జరిగినట్లు అభిప్రాయపడిందని చెప్పారు. న్యాయస్థానం నుంచి న్యాయం పొందిన రోజమ్మ ఉత్తర్వుల కాపీతో అసెంబ్లీలోకి వస్తే అడుగు పెట్టనీయక పోవడంకన్నా దారుణం మరొకటి ఉండదన్నారు. స్పీకర్, ముఖ్యమంత్రి తమకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ తాము కోర్టుల కన్నా పెద్దవాళ్లమని భావిస్తూ మా ఎమ్మెల్యేను రానివ్వలేదని జగన్ అన్నారు. ఉదయం 8.50 గంటలకు తాను అసెంబ్లీకి చేరుకునేటప్పటికే రోజమ్మను లోనికి రానివ్వక పోవడం  చూసి భద్రతా సిబ్బందిని ప్రశ్నించానని జగన్ చెప్పారు. ఈ అన్యాయానికి నిరసనగా గంటన్నర సేపు అక్కడే ధర్నా చేశామని అయినా అధికారపక్షం, స్పీకర్ వైఖరిలో మార్పు రాకపోవడంతో గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశామన్నారు. అక్కడి నుంచి గవర్నర్ జోక్యాన్ని కోరుతూ రాజ్‌భవన్‌కు వచ్చామని విపక్షనేత తెలిపారు.  
 
 కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తాం
 రోజమ్మ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని, న్యాయపోరాటాన్ని కొనసాగిస్తామని ప్రతిపక్షనేత జగన్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో శుక్రవారం ఉదయం జరిగినదంతా తమ న్యాయవాదులు కోర్టు దృష్టికి 10 గంటలకే తీసుకెళ్లారని, అంశాలన్నింటినీ కోర్టు పరిగణనలోకి తీసుకుందని కూడా ఆయన అన్నారు. కోర్టు ధిక్కార పిటిషన్‌ను సోమవారం వేస్తామని వాదనలు జరుగుతాయన్నారు. కోర్టు ఆదేశాలతోనే అసెంబ్లీలోకి హుందాగా రోజమ్మ అడుగు పెట్టేలా చేస్తామన్నారు. తమకు న్యాయస్థానాలపై పూర్తి నమ్మకం ఉందని, న్యాయ వ్యవస్థకు లోబడి ఆమెకు అండగా నిలబడతామన్నారు.
 
 నేడు అసెంబ్లీకి నల్లచొక్కాలతో... వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నిర్ణయం
 సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు శనివారం ఏపీ అసెంబ్లీకి నల్ల చొక్కాలు ధరించి హాజరు కావాలని నిర్ణయించారు. తమ ఎమ్మెల్యే ఆర్.కె.రోజాను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టాలని తీర్మానించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

>
మరిన్ని వార్తలు