నంద్యాలలోనే మంత్రుల తిష్ట

23 Aug, 2017 02:02 IST|Sakshi
నంద్యాలలోనే మంత్రుల తిష్ట
ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఫిర్యాదు 
 
సాక్షి, హైదరాబాద్‌: నంద్యాల నియోజకవర్గాన్ని విడిచి వెళ్లిపోవాలంటూ ఎన్నికల సంఘం విధించిన గడువు ముగిసినా మంత్రులు, అధికార టీడీపీ నేతలు అక్కడే తిష్ట వేశారని ఎన్నికల సంఘానికి వైఎస్సార్‌సీపీ ఫిర్యాదు చేసింది. పోలింగ్‌ ప్రశాంతంగా జరగకుండా, ఓటర్లను భయభ్రాంతులను గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ నేతలు కె.శివకుమార్, చల్లా మధుసూదన్‌రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ను కలిశారు. నంద్యాలలో నిబంధనలను ఉల్లంఘిస్తున్న అధికార పార్టీపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు.

బనగానపల్లెలో మంత్రులు కాల్వ శ్రీనివాసులు, సోమిరెడ్డి, అఖిలప్రియ మకాం వేశారని, ఆళ్లగడ్డలో మరో 12 మంది టీడీపీ ఎమ్మెల్యేలు తిష్టవేశారని గడికోట పేర్కొన్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ నేతలు ముక్కుపుడకలు, చీరలు, మద్యం విచ్చలవిడిగా పంచుతున్నారని, తక్షణమే స్పందించాలని ఈసీని కోరినట్లు చెప్పారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించిన ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి చానల్‌పై చర్య తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేసినట్లు గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఓటర్లకు డబ్బులు పంచుతూ దొరికిపోయిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణపై వెంటనే చర్యలు తీసుకోవాలని భన్వర్‌లాల్‌కు విజ్ఞప్తి చేసినట్టు తెలిపారు. ఓటర్లను ప్రభావితం చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న ప్రెస్‌మీట్లను అడ్డుకోవాలని ఈసీని కోరామన్నారు. దీనిపై భన్వర్‌లాల్‌ సానుకూలంగా స్పందించారని, చంద్రబాబు ప్రెస్‌మీట్లను కర్నూలు జిల్లాలో ప్రసారం కానివ్వబోమని హామీ ఇచ్చారని శ్రీకాంత్‌రెడ్డి వివరించారు.