బలవంతంగా గెంటేసినా గేటుముందు గొంతు విప్పి..

18 Dec, 2015 11:42 IST|Sakshi

హైదరాబాద్: కాల్ మనీ సెక్స్‌ రాకెట్పై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ అసెంబ్లీ బయటా వెలుపలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వ చర్యలు ఏమాత్రం సహించేవి కావంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. శుక్రవారం రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత సెక్స్ రాకెట్ పై వ్యవహారంపై చర్చ జరగాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇవ్వగా దానిని పక్కకు పెడుతూ స్పీకర్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చర్చ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. ఆ తర్వాత సభను వాయిదా వేసిన స్పీకర్ తిరిగి మరోసారి ప్రారంభించగా వైఎస్ఆర్ సీపీ అదే డిమాండ్ ను పట్టుబట్టింది.

దీంతో మొత్తం ప్రతిపక్షాన్ని స్పీకర్ సస్పెండ్ చేశారు. అంబేద్కర్ జన్మదినోత్సవంపై చర్చ పూర్తయ్యే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని చెప్పారు. అయితే, సభలో నుంచి వెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు తిరస్కరించడంతో సభలోకి మార్షల్స్ ను పెట్టించి బయటకు పంపించారు. దీంతో కొందరు గాంధీ విగ్రహం వద్ద నిరసనలు ప్రారంభించగా మరికొందరు అసెంబ్లీ గేటువద్ద ప్రభుత్వ వ్యతిరేక ఆందోళన ప్రారంభించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గేటు వద్ద కూర్చుని అక్కడి నుంచి కదిలేందుకు నిరాకరించారు.

మరిన్ని వార్తలు