తొమ్మిదేళ్ల బాలిక.. మెడ 90 డిగ్రీలు!

28 Oct, 2017 15:53 IST|Sakshi

పాకిస్తాన్‌లోని మిథికి చెందిన అఫ్‌షీన్‌ కుంబర్‌ 9 సంవత్సరాల బాలిక.  ప్రస్తుతం అఫ్‌షీన్‌ కండరాల రుగ్మతతో బాధపడుతోంది. ఆమె మెడ 90 డిగ్రీల కోణంలో ఉంది. దీంతో అఫ్‌షీన్‌ సరిగా నిలబడలేదు, నడవలేదు కూర్చున్న స్థానానికే పరిమితమవుతోంది. ప్రస్తుతం బాలిక తినడానికి కూడా ఇతరులపై ఆధారపడుతోంది. దీనిని నయం చేయడానికి ఎంత ప్రయత్నించినా ఫలితం లేదు. 

బాలిక తండ్రి అల్లా జురియా(55), తల్లి జమీలాల్‌లు ఇప్పటివరకు అనేక మంది వైద్యులను కలిశామని, అయినా ఈ సమస్యకు సంబంధించిన చికిత్స ఇక్కడ అందుబాటులో లేదని చెబుతున్నారు.  పుట్టినపుడు అఫ్‌షీన్‌కు ఈ సమస్య ఉండేదికాదని, ఎనిమిది నెలల వయసు ఉన్నపుడు ఆడుకుంటూ అఫ్‌షీన్‌ కింద పడిందని, అప్పటినుంచి ఇలానే బాధపడుతోందని వారు చెబుతున్నారు. 

ఇక్కడి వైద్యులు కరాచీలోని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సెంటర్‌కు ఆమెను తీసుకువెళ్ళమని సలహా ఇచ్చారు. మేము కూలీ పనులు చేసుకునే వాళ్లమని,  అక్కడికి తీసుకెళ్లి చికిత్స చేయించేంత స్థోమత మాకు లేదని వాపోతున్నారు. నా కూతురు ఇలా బాధపడుతుంటే చూడలేక పోతున్నానని.. ప్రభుత్వం సహకరిస్తే తిరిగి మాములుగా మారుతోందనే నమ్మకం నాకు ఉందని అల్లా జురియా అంటున్నాడు.  అఫ్‌షీన్‌ కండరాలకు వచ్చే అరుదైన రుగ్మతతో బాధ పడుతోందని స్థానిక డాక్టర్లు అంటున్నారు.

మరిన్ని వార్తలు