గొరిల్లాల కూనిరాగాల కథ తెలుసా?

26 Feb, 2016 09:30 IST|Sakshi
గొరిల్లాల కూనిరాగాల కథ తెలుసా?

లండన్: జర్మనీ పరిశోధకులు గొరిల్లాలకు సంబంధించి ఓ కొత్త విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. సాధారణంగా వాటికి ఆవేశం, సంతోషం వచ్చినప్పుడు గట్టిగా అరుస్తూ, బలంగా ఛాతీపై చరుచుకుంటాయన్న విషయం తెలిసిందే. ఆహారం తీసుకునే సమయంలో అవి పాటలు పాడుతాయని పరిశోధకులు కనుగొన్నారు. అంతేకాక చాలా బాగా కోరస్ ఇస్తాయట. అయితే, ఆడ, చిన్న గొరిల్లాల కంటే కూడా పెద్ద గొరిల్లాలలో ఈ తేడా స్పష్టంగా గుర్తించామని వెల్లడించారు. ముఖ్యంగా విత్తనాలు, పూలు తింటున్నప్పుడు అవి కూనిరాగాలు తీస్తాయట. చింపాంజీల తరహాలోనే ఆహారం తీసుకోవడానికి టైం అయిందని తమ మిత్ర బృందాన్ని ఆహ్వానిస్తాయని గమనించారు.

రిపబ్లిక్ ఆఫ్ కాంగోకు చెందిన గొరిల్లాలను పరిశీలించిన జర్మనీ రీసెర్చర్స్ ఈ విషయాలు కనుగొన్నారు. ఆడ, మగ, చిన్న గొరిల్లాలు ఇలా అన్నిరకాల వయసు ఉన్న గొరిల్లాలపై రీసెర్చ్ చేసి ఈ ఆసక్తికర విషయాలు బయటపెట్టారు. పిల్ల, ఆడ గొరిల్లాలు అప్పుడప్పుడు మాత్రమే పాడుతాయని, మగ గొరిల్లాలు తమకు నచ్చిన ఆహారం తింటున్నప్పుడు మరింత పెద్దగా శబ్దాలు చేస్తాయని జర్మనీకి చెందిన మ్యాక్స్ ప్లాంక్ ఇనిస్టిస్ట్యూట్ ఆఫ్ ఆర్నీతాలజీ సంస్థ ప్రొఫెసర్ ఇవా మారియా వెల్లడించారు. సాధారణంగా క్షీరదాలు, చాలా రకాల పక్షులు ఆహారం తీసుకునే సమయంలో గట్టిగా అరుస్తాయని జర్మనీ పరిశోధకులు కనుగొన్న వివరాలు ఇటీవల విడుదలయిన ఓ పత్రికలో ప్రచురితమయ్యాయి.

మరిన్ని వార్తలు