సిరియాలో అమెరికా దాడులు.. 9 మంది మృతి

9 Nov, 2023 08:31 IST|Sakshi

వాషింగ్టన్: సిరియాలో ఇరాన్‌ మద్దతునిస్తున్న దళాలపై అమెరికా దాడులు నిర్వహించింది. ఆయుధ నిల్వ కేంద్రంపై యుఎస్ యుద్ధ విమానాలు దాడి చేశాయని యుఎస్ డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ తెలిపారు. ఈ దాడుల్లో తొమ్మిది మంది మృతి చెందినట్లు సిరియన్‌ అబ్జర్వేటరీ ఫర్‌ హ్యుమన్‌ రైట్స్‌ చీఫ్‌ రమీ అబ్దెల్‌ రెహమాన్‌ తెలిపారు. ఇరాన్‌ మద్దతిస్తున్న కొన్ని సాయుధ దళాలు ఇరాక్‌, సిరియాల్లోని అమెరికా స్థావరాలపై జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. 

గాజా-ఇజ్రాయెల్‌ సంక్షోభం పశ్చిమాసియా ప్రాంతీయ యుద్ధంగా మారకుండా అమెరికా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో గాజా యుద్ధానికి ఈ దాడులకు ఎలాంటి సంబంధం లేదని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే పశ్చిమాసియాలో అమెరికా దళాలపై దాడులు మాత్రం సహించబోమని తెలిపేందుకే ఈ చర్యకు దిగినట్లు చెప్పారు. అమెరికా దళాలపై జరుగుతున్న దాడుల వెనుక ఇరాన్‌ ఉందని, వాటిని ఏమాత్రం సహించబోమన్నారు.

ఇస్లామిక్ రాజ్యాల వర్గాలను నిరోధించే ప్రయత్నాల్లో భాగంగా ఇరాక్‌లో దాదాపు 2,500 మంది, సిరియాలో 900 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇక్కడి సైనికులపై దాడులకు ప్రతిస్పందనగా అమెరికా గత వారంలోనే రెండోసారి దాడికి పాల్పడింది. ఈ పరస్పర దాడులు ఇరాన్-అమెరికా మధ్య పశ్చిమాసియాలో మరో అలజడి చెలరేగేలా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో గాజా-ఇజ్రాయెల్ యుద్ధం సంక్షోభాన్ని సృష్టిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు దిగుతోంది. ఇప్పటికే గాజాలో 10,500 మంది మరణించారు. 

ఇదీ చదవండి: Israel-Hamas War: నెల రోజులుగా నెత్తురోడుతోంది

మరిన్ని వార్తలు