బా.. బా.. బ్లాక్‌ షీప్‌..

28 Jul, 2017 03:52 IST|Sakshi
బా.. బా.. బ్లాక్‌ షీప్‌..
ఓసారి ఊహించుకోండి..
మీరో సినిమాకు వెళ్లారు.. నిడివి ఏకంగా 8 గంటలు..
చూద్దామంటే స్టోరీ ఉండదు.. డైలాగులు అసలే ఉండవు.
అసలు నటించడానికి మనుషులే ఉండరు..
ఉండేవన్నీ గొర్రెలే.. బా.. బా.. బా.. అంటూ వాటి అరుపులే..
 
బా బా ల్యాండ్‌... ప్రపంచంలోనే అత్యంత డల్‌ మూవీ.. నిద్రలేమికి మందు.. నిద్రమాత్ర కంటే పవర్‌ఫుల్‌..
ఈ విషయాన్ని సదరు చిత్ర నిర్మాతలే ప్రచారం చేసుకుంటున్నారు. పైగా.. సినిమా అంతా స్లోమోషన్‌.. గొర్రెలు అలా స్లోగా తిరుగుతూ.. గడ్డి తింటూ.. కూర్చుంటూ.. పడుకుంటూ ఉంటాయి. దీన్ని బ్రిటన్‌లోని ఎసెక్స్‌లో తీశారు. ‘ఇది ప్రపంచంలోనే అత్యంత డల్‌ మూవీ.. ప్రేక్షకులు కూడా అలాగే భావిస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడంతా నిరంతర ఒత్తిడి.. నిద్రలేని రాత్రులు.. చిట్టచివరికి మనకో చాన్స్‌ వచ్చింది.. ప్రశాంతంగా ఊపిరి పీల్చుకోవడానికి.. నిరంతరం పరుగులెడుతున్న మన మనసులను, బుర్రలను ప్రశాంతపరచడానికి.. కూర్చోండి.. ఆ గొర్రెలను అలా చూస్తూ ఉండండి’ అని చిత్ర నిర్మాత పీటర్‌ ఫ్రీడ్‌మన్‌ చెప్పారు.

సెప్టెంబర్‌లో విడుదల కానున్న తమ చిత్రం బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొట్టకపోవచ్చు గానీ.. దీనికంటూ ప్రత్యేకమైన ప్రేక్షకులు ఉంటారని తెలిపారు. 8 గంటలపాటు మంచి నిద్ర కోరుకునేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్‌ అని అన్నారు. ఇంకో విషయం.. దీనికి సీక్వెల్‌ కూడా తీయాలని అనుకుంటున్నారు.. పైగా దాన్ని మొదటి భాగంతో పోలిస్తే.. మరింత డల్‌గా తీస్తారట.. నిడివి కూడా పెంచుతారట.. ఓ 24 గంటల సమయానికి..!!
మరిన్ని వార్తలు