భారత వైద్యుల ఘనత: 8 కాళ్ల బిడ్డ సురక్షితం

18 Apr, 2017 17:24 IST|Sakshi
భారత వైద్యుల ఘనత: 8 కాళ్ల బిడ్డ సురక్షితం

పుట్టుకతో ఎనిమిది కాళ్లతో జన్మించిన కరమ్‌ ఆపరేషన్‌ అనంతరం తిరిగి సురక్షితంగా ఇంటికి చేరుకున్నాడు. గతేడాది అక్టోబర్‌లో ఇరాక్‌లో సర్వాద్‌ అహ్మద్‌ నాదర్‌, గుఫ్రాన్‌ అలీ దంపతులకు కరమ్‌ జన్మించాడు. పుట్టుకతోనే ఎనిమిది కాళ్లతో జన్మించడంతో బిడ్డకు ఆపరేషన్‌ చేయాలని అక్కడి వైద్యులు సూచించారు.

వైద్యుల సలహాతో కరమ్‌ను వెంటనే ఢిల్లీలోని జేపీ ఆసుపత్రిలో చేర్పించారు నాదర్‌, అలీ దంపతులు. అప్పటి నుంచి కరమ్‌కు మూడు సార్లు ఆపరేషన్లు నిర్వహించిన జేపీ ఆసుపత్రి వైద్యులు బిడ్డను కాపాడటంలో విజయం సాధించారు. పూర్తిగా కోలుకున్న కరమ్‌ను ఇంటికి పంపుతున్నట్లు మంగళవారం తెలిపారు.

తల్లి గర్భంలో ఉన్నప్పుడు కవలలు రూపుదిద్దుకుంటున్న సమయంలో హఠాత్తుగా రెండో బిడ్డ ఎదుగుదల ఆగిపోవడం వల్ల బిడ్డ ఇలా జన్మిస్తుందని వివరించారు. మొదటి ఆపరేషన్‌లో బిడ్డ పొట్టపై ఉన్న అవయవాలను తొలగించినట్లు చెప్పారు. ఆ తర్వాత బిడ్డ కార్డియాక్‌ సమస్యను ఎదుర్కొంటుండటంతో సర్జన్లు ఆ సమస్య నుం‍చి బిడ్డను బయటపడేశారని తెలిపారు.ఆ తర్వాత రెండు ఆపరేషన్లలో మిగిలిన భాగాల్లో ఉన్న అవయవాలను తొలగించినట్లు వివరించారు.

ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న మెడికల్‌ పర్యాటకుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఇందుకు ప్రధానకారణం భారత్‌ తక్కువ ధరలో ఉత్తమ వైద్యం అందిస్తుండటమే. ఈజిప్టుకు చెందిన ప్రపంచంలోనే అత్యంత బరువైన మహిళ తన బరువు తగ్గించుకోవడానికి ముంబైకు వచ్చిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు