పాపపై ఆశలు వదులుకోమన్నారు.. కానీ!

1 Sep, 2017 17:30 IST|Sakshi
పాపపై ఆశలు వదులుకోమన్నారు.. కానీ!

రియోడిజనీరో: ఆ పాప పుట్టినప్పుడు డాక్లర్లే కాదు.. చిన్నారి తల్లిదండ్రులు కూడా షాక్ తిన్నారు. ప్రాణం పోయాల్సిన డాక్లర్లు మాత్రం ఆ తల్లిదండ్రులను ఆశలు వదులుకోమన్నారు. చిన్నారి అంత్యక్రియలు చేసేందుకు సిద్ధం చేసుకోమని ఉచిత సలహా ఇచ్చారు. అందుకు బలమైన కారణం లేకపోలేదు. విచిత్రంగా జన్మించిన ఆ చిన్నారి తలలాంటి కాస్త భాగంతో పుట్టినా.. ముఖం రాకపోవడంతో వైద్యులు అలా చెప్పారు. అయితే ఆ చిన్నారి అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఇటీవల తన తొమ్మిదో పుట్టినరోజును జరుపుకుంది.

ఆ వివరాలిలా.. బ్రెజిల్ లోని బర్రా డేసో ఫ్రాన్సిస్కోకు చెందిన రోనాల్డో, జోసిలీన్ దంపతులకు తొమ్మిదేళ్ల కిందట ఓ పాప జన్మించింది. అయితే చిన్నారి తల భాగం ఉన్నా, ముఖం మాత్రం సరిగా ఏర్పడలేదు. కళ్లు, ముక్కు, నోరు అవయవాలు అందరిలా కాకుండా చాలా భిన్నంగా కనిపించడంతో డాక్లర్లు చిన్నారి విక్టోరియా మార్చియోలిపై ఆశలు వదులుకోవాలని, అంత్యక్రియలు చేయడమే ఉత్తమమని సూచించారు. 50వేల మందిలో ఒకరికి టీచర్ కోల్లిన్స్ సిండ్రోమ్ అనే అరుదైన సమస్యతో పుడతారని, దానివల్లే చిన్నారి విక్టోరియా ఇలా పుట్టిందని డాక్లర్లు పాప పేరెంట్స్ కు వివరించారు. రోనాల్డో, జోసిలీన్ దంపతులు తమ పాపై ఎన్నో ఆశలు పెంచుకున్నారు. చిన్నారికి తాత్కాలికంగా బ్రెజిల్ లోనే చికిత్స ఇప్పించారు.

 అనంతరం పాపకు అమెరికాలోని టెక్సాస్ ష్రైనర్స్ హాస్పిటల్ వైద్యులు చికిత్స అందించారు. పాపకు ఆరేళ్ల వయసు వచ్చేసరికే కళ్లు, ముక్కు, నోరు అవయవాలు కాస్త యాథాస్థితికి తేవడానికి ఎనిమిది సర్జరీలు చేయించినట్లు విక్టోరియా తల్లిదండ్రులు వివరించారు. పాప బతికే అవకాశమే లేదని వైద్యులు చెప్పినా, ఆశలు వదులుకోకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నారు. ఇటీవల ఆ చిన్నారి తమ కుటుంబసభ్యుల సమక్షంలో కేక్ కట్ చేసి తన తొమ్మిదో పుట్టినరోజును ఘనంగా జరుపుకుంది. కుటుంబం పడ్డ శ్రమే పాపకు ప్రాణం పోసిందని స్థానికులు చెబుతున్నారు.

మరిన్ని వార్తలు