బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇదేనా?

14 Mar, 2016 15:46 IST|Sakshi
బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఇదేనా?

లండన్: పెద్ద పెద్ద నౌకలతోపాటు ఆ మార్గం గుండా ఆకాశమార్గాన ప్రయాణిస్తున్న విమానాలను కొన్ని క్షణాల్లోనే మింగేసి సముద్ర గర్భంలో దాచేసే ‘బెర్ముడా ట్రయాంగిల్’ గురించి మరో ఆసక్తికరమైన అంశం వెలుగు చూసింది. బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోని నార్వే తీరానున్న బేరెంట్స్ సముద్ర గర్భంలో కిలోమీటరు వెడల్పు, 150 అడుగుల లోతైన క్రేటర్స్ (గొయ్యిలాంటి అగ్నిబిళ ముఖద్వారాలు) అనేకం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

ఈ క్రేటర్స్‌కు అడుగుభాగానున్న సహజవాయువుల నుంచి విపరీతంగా మిథేన్ గ్యాస్ వెలువడుతోందని, ఈ గ్యాస్‌కు పేలుడు స్వభావం ఉన్నందున అప్పుడప్పుడు పేలుళ్లు సంభవిస్తున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. పేలుడు సంభవించి మిథేన్ గ్యాస్ మండిపోయి ఆ ప్రాంతంలో ఏర్పడిన శూన్యాన్ని నింపడం కోసం సముద్ర జలాలు ఒక్కసారిగా క్రేటర్స్‌లోకి చొచ్చుకుపోవడం వల్ల భారీ నౌకలు కూడా మునిగిపోతున్నాయని వారు అంచనా వేశారు.

కొన్ని సందర్భాల్లో మంచుగడ్డ రూపంలో ఉన్న మిథేన్ గ్యాస్ కూడా తగులబడి పోవడం శూన్యం మరింత విస్తరిస్తున్నట్లుగా వారు అభిప్రాయపడ్డారు. విమానాలు కూలి పోవడానికి కూడా మథేన్ గ్యాస్ మండిపోవడంతో ఏర్పడిన శూన్యమే కారణమా? అన్న అంశాన్ని ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని వారంటున్నారు. ఏదేమైనా క్రేటర్స్‌ను కనగొనడం ద్వారా బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ వీడినట్లేనని వారు చెబుతున్నారు.  బెర్ముడా ట్రయాంగిల్ బ్రిటన్ అంతర్జాతీయ జలాల ప్రాదేశిక ప్రాంతం నుంచి ఫ్లోరిడా తీరంలోని ప్యూర్టోరికా వరకు విస్తరించి ఉంది.

మరిన్ని వార్తలు