ప్రధాని నగ్న ఫోటోలు.. బీజేపీ అతి

5 Apr, 2018 20:00 IST|Sakshi

సాక్షి, ముంబై : సోషల్‌ మీడియాలో పోస్టుల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకపోతే నవ్వులపాలయ్యే అవకాశం పుష్కలంగా ఉంటుంది. సరిగ్గా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అలాంటి పరిస్థితులనే ఎదుర్కుంటోంది. తాజాగా పాక్‌ ప్రధాని షాహిద్‌ కక్కాన్‌ అబ్బాసీ అమెరికా పర్యటనలో చేదు అనుభవం ఎదుర్కున్న వార్త ఒకటి విపరీతంగా చక్కర్లు కొట్టింది. న్యూయార్క్‌ జేఎఫ్‌కే ఎయిర్‌పోర్ట్‌ వద్ద భద్రతా సిబ్బంది ఆయన్ని క్షుణ్ణంగా పరిశీలించారని.. ఈ క్రమంలో ఆయన బట్టలూడదీసినట్లు కొన్ని ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

బీజేపీకి చెందిన ఓ ఫేస్‌బుక్‌ పేజీ అబ్బాసీ ఫోటోలంటూ వాటిని వైరల్‌ చేస్తూ... ‘పందులు కులభూషణ్‌ భార్య మంగళసూత్రాన్ని తీయించాయి. అమెరికా అధికారులు పాక్‌ ప్రధాని గుడ్డలూదీయించారు’ అంటూ సందేశాన్ని ఉంచింది. ఆ గ్రూప్‌లో లక్షల్లో ఫాలోవర్లు ఉండటంతో ఆ ఫోటో వేల సంఖ్యలో షేర్‌ అయ్యింది. అదే తరహాలో మరికొన్ని గ్రూప్‌లు ‘భారత్‌తో పెట్టుకుంటే అంతే..’ అంటూ కామెంట్లతో ఆ ఫోటోలను షేర్‌ చేశాయి. కానీ, ఆ ఫోటోలు అబ్బాసీవి కాదన్న విషయం ఇప్పుడు తేలిపోయింది. 

ముంబైకి చెందిన ఓ వార్తాసంస్థ గూగుల్‌ ద్వారా ఆ ఫోటోలను నిర్ధారణ చేసేసింది. 2015లో డెయిలీ మెయిల్‌ ప్రచురించిన ఓ కథనంలోని ఫోటోలు అవి. భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగిన ఓ రష్యన్‌ ప్రయాణికుడు మొత్తం బట్టలిప్పదీసి నగ్నంగా నడిచాడు. ఆ ఘటనంతా సీసీ ఫుటేజీలో నమోదు కాగా.. అప్పటి ఫోటోలను ఇప్పుడు అబ్బాసీ ఫోటోలంటూ ఎవరో అప్‌ లోడ్‌ చేశారు. వాటిని పట్టుకున్న బీజేపీ.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ చేసేసింది. ఇక ఇప్పుడు ఈ వ్యవహారాన్నంతా బీజేపీ అతి అంటూ ట్రోల్‌ చేసి పడేస్తున్నారు.

                                                       బీజేపీ వైరల్‌ చేసిన పోస్ట్‌ ఇదే...

                              వార్త సంస్థ బయటపెట్టిన వీడియో తాలుకూ స్క్రీన్‌ షాట్‌

మరిన్ని వార్తలు